తెలంగాణలో చలి తీవ్రత భారీగాపెరిగిపోయింది. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉండగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా పిల్లల్లో శ్వాసకోస సంబంధిత సమస్యల తీవ్రత సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20 శాతం నుంచి 30 శాతం పెరిగిందని చెబుతున్నారు.
చలి వాతావరణంలో పిల్లలపై ఎక్కువగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. జలుబు, దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. కిడ్నీ సమస్యలు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇన్‌ఫెక్షన్లు లోనికి వెళితే మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు గోరు వెచ్చని నీరు తాగడం శ్రేయస్కరమని.. చర్మం ఎండిపోకుండా మాయిశ్చరైజర్లు, నూనెలు రాసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read:‘గేమ్ చేంజర్’.. థర్డ్ సింగిల్