సునీతా లక్ష్మారెడ్డి చేరికతో నర్సాపూర్‌లోనే కాదు మెదక్‌లో టీఆర్ఎస్ బలోపేతం అవుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని తెలిపారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన హరీష్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు.
దేశంలో నెంబర్ 1 సీఎంగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారని చెప్పారు. కాంగ్రెస్,బీజేపీలకు తెలంగాణలో మనుగడ ఉండదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వారు డిపాజిట్ల కోసమే పోటీచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ నేతల మధ్యే పోటీ ఉందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలకు జనం కరువైపోయారని చెప్పారు.
రాహుల్ గాంధీ,మోడీ తెలంగాణలో ఎన్ని పర్యటనలు చేసినా శూన్యమే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని,కేంద్రమంత్రులు ప్రచారం చేస్తే 103 స్ధానాల్లో డిపాజిట్లు కొల్పోయారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణకు ఒక కేంద్రమంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్,బీజేపీ నేతల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు.
కాళేశ్వరంకు జాతీయ హోదా,బయ్యారం ఉక్కు పరిశ్రమ రావాలంటే 16 ఎంపీ స్ధానాలను గెలవాలన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని తెలంగాణలోనే భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.