తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 13వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సెప్టెంబరు 14వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 15న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 16న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
తిరుమల రెండు ఘాట్ రోడ్లలో వినాయక చవితి
తిరుమలకు వెళ్ళె రెండు ఘాట్ రోడ్లలోని శ్రీ విఘేశ్వరస్వామివారి ఆలయాలలో సెప్టెంబరు 5వ తేదీ సోమవారం వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయ.ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తితిదే ఉన్నాతాధికారులు పాల్గొంటారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 6వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని పురస్కరించుకుని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 13వ తేదీన అంకురార్పణం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేయనున్నారు. సెప్టెంబరు 14వ తేదీ బుధవారం పవిత్రోత్సవాల్లో మొదటిరోజు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 15న రెండో రోజు గురువారం కల్యాణోత్సవం, తిరుప్పావడ మరియు ఊంజల్‌సేవ, సెప్టెంబరు 16న పవిత్రోత్సవాల్లో చివరిరోజు శుక్రవారం కల్యాణోత్సవం, లక్ష్మీపూజ మరియు ఊంజల్‌సేవలను తితిదే రద్దు చేయనుంది.
కాలి నడక భక్తులకు నూతన క్యూ కాంప్లెక్స్
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి కాలి నడక మార్గంలో విచ్చేసే భక్తులకు (దివ్యదర్శనం) నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పసులను తితిదే కార్యనిర్వహణాధికారి డా. డి సాంబశివరావు ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దివ్యదర్శనం భక్తులకు బ్రహ్మోత్సవాలలోపు నూతన క్యూ కాంప్లెక్స్ అందుబాటులోనికి తీసుకు రావాలని ఇంజినీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించి భక్తులకు మరింత సౌకర్యాంగా వుండేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అంతకుముందు శ్రీవారి దర్శనానికి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కూ లైన్లను తితిదే అందిస్తున్న పాలు, టీ, కాఫీ, అన్నప్రసాదాలు గురించి భక్తులను అడిగి తెలుపుకున్నారు. భక్తులు తితిదే అందిస్తున్న సౌకర్యాలపై ఈవోతో సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. శ్రీ రామచంద్రరెడ్డి, విజిఒ శ్రీ రవీంధ్రరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.