ట్రంప్‌ను ఆశ్రయించాలా?

1
- Advertisement -

జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ఇప్పటివరకు అనుసరించిన మార్గాలతో ఆశించిన ఫలితం రాకపోతే, ఇక కొత్త విధానాన్ని అవలంబించే సమయం వచ్చిందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ…మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆశ్రయించాలా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భారీ నిరసన చేపట్టనుంది. ఈ ఆందోళనకు వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ తెలిపింది.

ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..రాష్ట్ర హోదా కోసం అసెంబ్లీలో తీర్మానాలు ఆమోదించామని, ప్రధానమంత్రి సహా కేంద్ర నాయకత్వంతో పలుమార్లు చర్చించామని, అయినప్పటికీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన అన్ని మార్గాలను అనుసరించిన తర్వాత కూడా స్పందన లేకపోవడం నిరాశ కలిగిస్తోందని అన్నారు.

జమ్మూకశ్మీర్ ప్రజల హక్కులు, అభివృద్ధి, ప్రజాప్రతినిధ్య వ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్ర హోదా పునరుద్ధరణ అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇక జూలై 20న జరిగే నిరసనకు రాజకీయ పార్టీలతో పాటు పౌరసంఘాలు, సామాజిక సంస్థలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆందోళన ద్వారా జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా అంశాన్ని జాతీయ స్థాయిలో మరోసారి బలంగా వినిపించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read:ఇంగ్లాండ్‌తో వన్డేలు..టీమిండియా మార్పులు!

- Advertisement -