జిల్లాల ఏర్పాటుపై హైపవర్ కమిటీ

553
- Advertisement -

జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ మేరకు ఎంపీ కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.నాలుగైదు రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆయా కేంద్రాలను జిల్లాలుగా చేసే పక్షంలో ఎంత జనాభా ఉండాలి? ఏయే మండలాలు కలుపాలి? అనే సాంకేతిక అంశాలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. అధికారులనుంచి మరో నివేదికను కూడా సీఎం తెప్పించుకోనున్నారని సమాచారం. ఈ రెండు నివేదికల ఆధారంగా సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంతిమంగా ప్రజాభీష్టం మేరకే ఉండాలని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.

ప్రజలు ఏది కోరుకుంటే అదే చేద్దామని తరచూ చెప్తున్న సీఎం.. ఆ మేరకు ఇప్పటికే 27 జిల్లాల ఏర్పాటుపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ కూడా విడుదలచేశారు. ప్రజలనుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. లక్షకుపైగా సూచనలు, సలహాలు, అభ్యంతరాలు, కొత్త డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల టీఆర్‌ఎస్ నాయకులతోనూ విస్తృతంగా సంప్రదింపులు జరుపాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. సీఎం సూచన మేరకు జిల్లా నేతలంతా ప్రత్యేకంగా చర్చించుకొని ఏకగ్రీవ అభిప్రాయాన్ని తెలియజేశారు. డ్రాప్ట్ నోటిఫికేషన్‌కు స్వల్ప మార్పులతో ఆమోదం తెలిపారు.

నూతన జిల్లాల ఏర్పాటు ప్రజల సౌకర్యానికే గానీ లీడర్ల కన్వీనియన్స్ కోసం కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. నేతలంతా ప్రజల సౌకర్యం, వారి అవసరాలు, జిల్లాల అభివృద్ధి దిశగా ఆలోచించాలన్నారు. కొందరు లీడర్లకోసం జిల్లాలు ఏర్పాటు చేయడం కుదరదని స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అత్మకూరు, సీసీకుంట, అమరచింత మండలాలపై జిల్లా నేతల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆయా మండలాల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని వారిని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచాలా? ప్రతిపాదిత వనపర్తి జిల్లాలో ఉంచాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు.

కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకోసం ముసాయిదా విడుదలచేశాం. దానికి ప్రజలనుంచి సూచనలు, అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వివిధ మార్గాలద్వారా సమాచారం వచ్చింది. ప్రజలేం కోరుకుంటున్నారు? వాళ్ల అవసరాలేంటి? ముసాయిదాలో మార్పులు, చేర్పులు అవసరమా? అనే విషయాలపై అధ్యయనం సాగింది. అనేక విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ముసాయిదాలో ప్రకటించినవే కాకుండా ప్రజలు కోరుకునేలా మార్పులు, చేర్పులు జరుగుతాయి. అవసరమనుకుంటే వాటి సంఖ్యలో కూడా మార్పు ఉంటుంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

kcr
కొత్త జిల్లాలు దసరానుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి తాత్కాలిక కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలి. శాశ్వత కార్యాలయాలకోసం స్థలాలు అన్వేషించాలి. ప్రతి జిల్లాకేంద్రంలో అన్నిశాఖల కార్యాలయాలతో కూడిన కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం, కోర్టుల ప్రాంగణం ఉండేలా స్థలం అన్వేషించాలి. ఈ మూడింటికీ ఒకేచోట స్థలం లభ్యంకాకున్నా, వేర్వేరు చోట్లయినా జాగాలు చూడాలి. ప్రజలకు సౌకర్యంగా ఉండే వ్యూహాత్మక ప్రాంతాలను ఎంపిక చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో స్థలాల ఎంపిక జరుగాలి అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశాల్లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావుతోపాటు ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

-మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, బొమ్మరాస్‌పేట మండలాలను ప్రతిపాదిత వికారాబాద్ జిల్లాలో కలుపాలని నిర్ణయించారు. ప్రతిపాదిత వికారాబాద్ జిల్లాలో ఉన్న గండీడ్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపారు.
-ప్రతిపాదిత వికారాబాద్ జిల్లాలో ఉన్న మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాలను ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో కలుపుతారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్లు, తేలకొండపల్లి, మద్గుల్ మండలాలు ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో కలుపాలని నిర్ణయించారు.
-మహబూబ్‌నగర్ జిల్లాలో అదనంగా మరో 10 నూతన మండలాలు ఏర్పాటు చేయాలన్న జిల్లా నేతల ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. రంగారెడ్డి జిల్లాలో నిజాంపేటతోపాటు శేరిలింగంపల్లిలో అదనంగా మరో రెండు మండలాలు ఏర్పాటు చేయాలని కోరారు.
-ప్రతిపాదిత వికారాబాద్‌జిల్లాలోని తాండూరును నూతన రెవెన్యూ డివిజన్ చేయాలన్న మంత్రి మహేందర్‌రెడ్డి విజ్ఞప్తికి కేసీఆర్ అంగీకరించారు.
-నిజామాబాద్ జిల్లాలో నూతనంగా ఎల్లారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని జిల్లా నేతలు ఏకగ్రీవంగా సీఎంను కోరగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
-రెవెన్యూ గ్రామాల పరిధిలోని గ్రామాలను విధిగా ఒకే మండలంలో కొనసాగించాలనే నియమం లేదు. ఆ గ్రామాలను రెండు వేర్వేరు మండలాల్లో చేర్చా ల్సి వస్తే వాటిని ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి. రెవెన్యూ గ్రామం వంకతో దూరంగా ఉన్నా సరే అదే మండల కేంద్రంలో కొనసాగించ వద్దు.
-తెలంగాణకోసం ఉద్యమించిన కొండా వెంకటరంగారెడ్డి స్వగ్రామం పెద్ద మంగళారం ప్రస్తుతం శంషాబాద్ జిల్లాలో చేరుతున్నది. కనుక ఆ జిల్లాకు రంగారెడ్డి పేరుపెట్టాలి. వికారాబాద్ కేంద్రంగా మరో జిల్లా ఉంటుంది.
-మూడు క్యాటగిరీలుగా మండలాలు ఉండాలి. పట్టణ ప్రాంత మండలాల్లో యంత్రాంగం ఒక విధంగా, సాధారణ మండలాలకు అధికారుల కూర్పు మరొకలా ఉండాలి. చిన్న మండలాలకు అత్యంత అవసరమైన అధికారులుండాలి.
-ప్రతిపాదిత కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎల్లారెడ్డి, ప్రతిపాదిత మెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలి.
-కామారెడ్డి నియోజకవర్గంలో బీబీపేట మండలం ఏర్పాటుకు నిర్ణయించారు.
-ఆమనగల్లు, మాడ్గుల, తేలకొండపల్లి మండలాలు, కొత్తగా ఏర్పాటు అయ్యే కడ్తాల్ మండలం ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో చేర్చాలని ప్రజాభిప్రాయం వచ్చినందున దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
-దౌల్తాబాద్ మండలం ఏ జిల్లాలో ఉండాలనే విషయంలో మరోసారి ప్రజాభిప్రాయం తీసుకోవాలి.
-కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దొమ్మరి పోచమ్మ పేరును గండిమైసమ్మ మండలంగా మార్చాలి.
-నల్లగొండ జిల్లా ముసాయిదాలో ప్రకటించిన ఏడు కొత్త మండలాలతో పాటు మద్దిరాల, నేరేడుగొమ్మ, మల్లారెడ్డిగూడెం, పాలకవీడు మండలాలపై ఏకాభిప్రాయం కుదిరింది. సంస్థాన్‌నారాయణపూర్ మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలపాలనే వినతులు వస్తున్నందున ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలి. ఈ మండలాన్ని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలి.
-ప్రతిపాదిత సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మండలం ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలి. ఆందోల్ నియోజకవర్గంలో వట్టిపల్లి మండలం ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలి.

గతంలో మండలాల ఏర్పాటుతోపాటు అనేక సందర్భాల్లో ప్రజలే కేంద్రంగా నిర్ణయం తీసుకోక సమస్యలొచ్చాయి. అవి అలాగే కొనసాగుతున్నా యి. మనం అలా చేయకూడదు. మన ఆలోచన, ఆచరణకు ప్రజలే కేంద్రంగా ఉండాలి. మనం లేకున్నా ప్రజలుంటారు. మండలాలు, జిల్లాలుంటాయి. అవి గొప్పగా పని చేయాలి. ఇంత గొప్ప పనిచేసి ప్రజల నుంచి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. బాగా చేశారని ప్రజలంతా చెప్పుకోవాలి. నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను పక్కనబెట్టాలి. నేతల పెత్తనం కోసం కాకుండా ప్రజలు కోరుతున్న వాటినే ప్రతిపాదించాలి. నేతలు సరిగ్గా ప్రతిపాదనలు చేయకున్నా ప్రభుత్వానికి ఇతరత్రా సమాచారం ఉంటుంది. ప్రజల అభిప్రాయాలు తీసుకుని, వివిధ మార్గాల్లో సమాచారం సేకరించి అంతిమంగా ప్రజలే కేంద్రంగా నిర్ణయం తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ అన్నారు.

- Advertisement -