జనతా క్యాబేజ్‌…

599
- Advertisement -

విభజన చట్టంలో ఏపీకి దక్కాల్సిన అంశాలపై ఇప్పటివరకు నాన్చుడు ధోరణి వహించిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు చకాచకా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఓ ‘ప్రత్యేక ప్యాకేజ్’ను ప్రకటించింది. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్యాకేజీతో సరిపెట్టారు. ఏపీలోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోరుతున్నారని పేర్కొన్న అరుణ్‌జైట్లీ…అది సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ఏపీ రావాణకాష్టంలా మారింది. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు రేపు(సెప్టెంబర్‌ 10న)ఏపీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇంతవరకు ఏపీకి ప్రత్యేక హోదాపై నాన్చుతు వచ్చిన కేంద్రం…. ఒక్కసారిగా ప్యాకేజీ అంటూ కొత్త పల్లవి అందుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రతిపక్షాలకు ఏపీకి ప్రత్యేక హోదా….బీజేపీ,టీడీపీ వైఫల్యం బ్రహ్మస్త్రంలా దొరికింది.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై వైసీపీ,సీపీఐ ఘాటుగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ గుండెలపై పొడిస్తే, సీఎం చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే మరోసారి వెన్నుపోటు పొడిచారని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ..ప్రజల చెవిలో పెద్ద క్యాబేజ్ పెట్టిందని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై రెండేళ్లు ఎదురుచూసేలా చేసిన కేంద్రం.. ఏపీని మోసం చేసిందన్నారు. ఇంత జరిగినా చంద్రబాబు నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని, ప్రత్యేక హోదాపై చర్చ జరగాలా? వద్ద అనే విషయంపై చంద్రబాబు స్పందించడం లేదని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

babu

ప్రత్యేక హోదా అంశం కేంద్రమంత్రి వెంకయ్య,సీపీఐ నారాయణ మధ్య మాటల యుద్దానికి దారితీసింది. వెంకయ్యలో గానీ వెంకయ్య పంచెలో గానీ ఏమి లేదన్న విషయం ఆరో తేదీ అర్ధరాత్రే తనకు అర్థమైందని నారాయణ దుయ్యబట్టారు. అప్పుడేమో ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇవ్వాలంటూ ఉడుం పట్టుబట్టిన వెంకయ్య ఇప్పుడు మాత్రం ఊసరవెల్లిలా మారిపోయారని ఆరోపించారు.ప్రత్యేకహోదాపై జిల్లాలన్నీ తిరిగి సన్మానాలు చేయించుకుని , ఇపుడు మాట మారిస్తే అది “నాలుకా తాటిమట్టా ” అంటే యెలావుంటుందని పరుషపదజాలంతో దుషించారు.

ఇక జనసేన అధినేత పవన్ సైతం కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో బీజేపీ,టీడీపీని తూర్పారబట్టారు.ప్యాకేజీ పేరుతో ఏపీకి పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందని దుయ్యబట్టారు. టీడీపీ ఆ లడ్డూలను తీసుకుంటుందా అని ప్రశ్నించారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. కేంద్రం ఇచ్చింది ప్యాకేజీ కాదని జనతా క్యాబేజ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరి ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.హోదా విష‌యంలో రాజీ ప‌డే ఛాన్స్ లేద‌ని అనంత‌పురంలో రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడిన బాబు ఇప్పుడు ఎందుకు పలకడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే,కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై టీడీపీ నేతలు గానీ, చంద్రబాబు కానీ మిన్నకుండా ఉండిపోయారు. హోదా ఇవ్వ‌మని కేంద్రం తెగేసి చెబుతోంద‌ని, దానికి ఉండే ఇబ్బందులు, ఆటంకాలు దానికి ఉన్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో మ‌నం(ఏపీ) హోదా కోసం ప‌ట్టుబ‌డితే.. మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని కాబ‌ట్టి కేంద్రం ముద్దుగా ఇస్తాన‌ని చెబుతున్న ప్యాకేజీని పుచ్చేసుకుని, మ‌నం కోరుకుంటున్న హోదా కోసం త‌ర్వాత పోరాటం చేద్దామ‌ని నేత‌లు అంటున్నారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

- Advertisement -