నరాలు తెగే ఉత్కంఠ…చివరిదాకా ఉరించిన విజయం…భారత్ గెలుపు నల్లేరు పై నడకే..కానీ చివరి క్షణంలో మ్యాజిక్…దిగ్గజ ఆటగాడు క్రీజ్‌లో ఉన్న భారత్ అనూహ్య పరిణామాల మధ్య ఓటమి పాలైంది. అమెరికాలో విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ తీరిది. 20 ఓవర్లలో 246 పరుగులు. భారీ లక్ష్యం…కానీ టీమిండియా బ్యాట్స్ మెన్ లోకేష్ రాహుల్ ముందు చిన్నబోయింది. ఫలితంగా చివరి ఆరు బంతుల్లో భారత్‌కు కావాల్సింది 8 పరుగులే. తొలి ఐదు బంతుల్లో ఆరు పరుగులు వచ్చాయి.భారత్‌కు ఎన్నో సంచలన విజయాలు అందించిన ధోని 1 బంతికి 2 పరు గులు చేయలేడా..? ఇక భారత్ విజయం లాంఛనమే. టి20 క్రికెట్‌లో ఏ జట్టూ ఛేదించనంత భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ భారత్ విజయం సాధించబోతోంది..!ఇది సగటు క్రీడా అభిమాని మదిలో వచ్చిన ఆలోచన.
కాని ఫలితం తారుమారైంది. బ్రేవో బంతి వేశాడు. ధోని షార్ట్ థర్డ్‌మ్యాన్ దిశగా స్లైస్ షాట్ ఆడాడు. ఆ ఫీల్డర్‌ని తప్పిస్తే చాలు. ఫోర్ ఖాయం. ధోని ఆడాడు. బంతి గాల్లోకి లేచింది. అలా వెళ్లి శామ్యూల్స్ చేతిలో పడింది. అప్పటిదాకా చిందులు వేసిన భారత అభిమానులకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. భారత్ ఓడిపోయింది. నిజం… జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినా… గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.
భారత్, వెస్టిండీస్ కలిసి అమెరికా ప్రేక్షకులకు టి20 క్రికెట్‌లో అసలు వినోదం ఎలా ఉంటుందో చూపించారు. కొడితే ఫోర్… లేదంటే సిక్సర్… ఒకరిని మించి మరొకరు… ఒకరిని మరపిస్తూ ఇంకొకరు… బౌండరీల వర్షంతో, సిక్సర్ల సునామీతో అమెరికాను అలరించారు. 40 ఓవర్లలో 489 పరుగులు… వినడానికి ఆశ్చ ర్యంగా ఉన్నా టి20 చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్ ఇది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ పరుగుల వరద పారిచింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (49 బంతుల్లో 100; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంస ఆటతీరుతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ చార్లెస్ (33 బంతుల్లో 79; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) వేగంగా ఆడాడు. స్టువర్ట్ బిన్నీ వేసిన 11వ ఓవర్‌లో ఎవిన్ లూయిస్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది విధ్వంసమే సృష్టిం చాడు. దీంతో విండీస్ 6 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. రహానె (7), కోహ్లి (16) విఫలమవడంతో 5 ఓవర్లకు భారత్ 51/2తో నిలిచింది. ఐతే ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్‌కు.. రాహుల్ తోడవడంతో భారత ఇన్నింగ్స్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. విండీస్‌కు దీటుగా 11 ఓవర్లకే 131/2కు చేరుకుంది. రోహిత్ ఔటయ్యాక వచ్చిన ధోని కూడా ధాటిగానే ఆడాడు. 4 ఓవర్లలో 53 పరుగులు అవసరమైన స్థితిలో రసెల్ వేసిన 17వ ఓవర్లో 20 పరుగులు రావడంతో సమీకరణం తేలిగ్గా మారింది.
ఐతే 18వ ఓవర్లో బ్రావో.. ఇన్నింగ్స్ లయను దెబ్బ తీశాడు. 9 పరుగులే ఇచ్చాడు. ఈ ఓవర్లో ధోని బాగా ఇబ్బంది పడ్డాడు. షాట్లు ఆడలేక ధోని తికమకపడటం చూసి.. చివరి ఓవర్లోనూ అదే తరహాలో తెలివిగా బౌలింగ్ చేశాడు బ్రావో. 19వ ఓవర్లో రాహుల్.. వరుసగా 6, 4 బాదడంతో 16 పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి చేరువైంది.చివరి బంతికి 2 పరుగులు అవసరమవగా.. ధోని ముందుకొచ్చి స్లిప్ వైపు బంతి మళ్లించబోయాడు. బంతి గాల్లోకి లేచింది. శామ్యూల్స్ క్యాచ్ అందుకున్నాడు. ఓవర్ తొలి బంతికి అదే తరహా షాట్ అక్కడే క్యాచ్ లేపాడు ధోని. శామ్యూల్స్ క్యాచ్ వదిలేశాడు. అయినా మళ్లీ అక్కడే అదే షాట్ ఆడి దొరికిపోయాడు ధోని. విండీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన లూయిస్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. రెండో టీ20 ఇవాళ జరగనుంది.