హీరోయిన్లుగా కెరీర్ మొదలు పెట్టిన కొందరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే వివాహం చేసుకుని సెటిల్ అయిపోతున్న జాబితా పెరుగుతోంది. ఇటీవలే కేరళ కుట్టి నజ్రియా ఇలాగే వివాహం చేసుకోగా, తాజాగా ఆమె బాటలోనే వన్ సినిమా వండర్ గా నిలిచిన బిచ్చగాడు ఫేం సాట్నా టైటస్ చేరింది. తమిళ సినిమా పిచ్చైక్కారస్ తో హీరోయిన్ గా పరిచయమైన సాట్నా టైటస్ రహస్య వివాహం చేసుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ సినిమాను తమిళనాట పంపిణీ చేసిన బయ్యర్ కార్తీతో సాట్నా ప్రేమలో పడింది. దాంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా నెల రోజుల క్రితం ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. దీంతో తాను నటించేందుకు అంగీకరించిన ‘తిట్టం పోట్టు తిరుడర కూట్టం’ అనే చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ ను ఆమె తిరిగి ఇచ్చేసింది. మరోపక్క, అమీర్ దర్శకత్వంలో ‘సంగదేవన్’ సినిమాలో నటించేందుకు అంగీకరించగా, దాని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాహం పట్ల సాట్నా తల్లి ఆగ్రహంగా ఉన్నారని, తన కుమార్తెను కార్తీ మాయలో పడేశాడని, అతని నుంచి సాట్నాను విడిపించాలంటూ ఆమె నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా సాట్నాను రిజిస్టర్ వివాహం చేసుకున్న బయ్యర్ కార్తీ మాత్రం తమ పెళ్లి ఇరు కుటుంబాల సమ్మతంతోనే జరిగిందని త్వరలో బహిరంగంగా మళ్లీ పెళ్లి చేసుకుంటామని చెప్పారు. పెళ్లి తర్వాత సాట్నా తన నటనకు స్వస్తి చెప్పనున్నారని చెప్పారు.