14 నెలల సుదీర్ఘ నిరక్షణకు తెరపడింది.లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగు ఇంజినీర్లు బలరామ్ కృష్ణ(తెలంగాణ), గోపీకృష్ణ(ఏపీ)లకు విముక్తి లభించింది. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ నిర్విరామ కృషితో ఉగ్రవాదుల చెరనుంచి బాధితులు విడుదలయ్యారు. ఇరువురి విడుదలను విదేశీ వ్యవహారాలశాఖ నిర్ధారించింది. కాగా తెలుగు ఇంజినీర్ల విడుదలపై హర్షం వ్యక్తంచేస్తూ రాష్ర్ట ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సుష్మాస్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. 29 జూలై, 2015న ఉగ్రవాదులు వీరిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తమవారి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గోపీకృష్ణ, కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ చిలువేరు బలరాంల కుటుంబాలు నగరంలోనే స్థిరపడ్డాయి. గోపీ భార్యపిల్లలు నాచారంలో, బలరాం భార్యాపిల్లలు ఆల్వాల్‌లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా లిబియాలో పనిచేస్తూ, స్వస్థలానికి తిరిగి వస్తున్న క్రమంలో 2015 జూలై 29న ట్రిఫోలి సమీపంలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇటీవల లిబియా దేశంలో అమెరికా సైనికులు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట వీరు బందీలుగా ఉన్న స్థావరాలపై దాడులు చేయగా, వీరు సురక్షితంగా బయట పడినట్లు సమాచారం.
తెలుగు ఇంజనీర్లు విడుదల కావటంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ మేరకు గోపీకృష్ణ వారి కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. గోపికృష్ణ ఉగ్రవాదుల చెర నుంచి బయట పడినట్లు సమాచారం రావడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సన్నిహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.