ఎవని భాష వాడు రాయాలె..

1178
kaloji
- Advertisement -

ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తె అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె.అన్ని రకాల ఆధిపత్యాలపై, అన్యాయాలపై తిరుగుబాటు చేసిన ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పలుకులివి. పద్మవిభూషణ్ బిరుదు కన్నా ప్రజాకవి అన్న బిరుదే గొప్పదని ప్రకటించిన కాళోజీ ప్రజల భాషనే అనుసరించాలన్నారు. కాళోజీ అంటే ధిక్కారం. ఆయన అన్యాయాన్ని సహించలేడు. పెత్తందారీ, అప్రజాస్వామ్యంపై తన అక్షరాల కొరడాను ఝళిపించిన యోధుడు..తెలంగాణ పల్లె పైరుగాలి నుంచి వీచిన భాషనే సాహిత్య భాషగా మార్చిన కవి… పదవులు, హోదాలకు అదరక, బెదరక ప్రశ్నించే ప్రజల పక్షపాతి! ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పరితపించిన హక్కుల నేత… సామాన్యుల గొడవనే తన గొడవగా ఎలుగెత్తిన ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతి నేడు. ప్రభుత్వమే అధికారికంగా కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. కొత్త ప్రభుత్వం తెలంగాణ భాషా సంస్కృతులకు పట్టంగడుతున్నది.

భాష పట్ల వివక్షను కాళోజీ ఏ రోజూ సహించలేదు. పరభాషా వ్యామోహం తగదని హెచ్చరించాడు. విశాలాంధ్ర ఉద్యమాన్ని సమర్థించిన కాళోజీ తరువాత కోస్తాంధ్ర ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. వానాకాలంలోనూ చేనులెండిపోతాయని/ మండే వేసవిలో వలె ఎండలు కాస్తుంటాయని ఎవరనుకున్నారు?/ అట్లవునని ఎవరనుకున్నారు? అంటూ తెలంగాణ గొంతుక వినిపించాడు. ఆయన నా గొడవ నిత్యం మండిస్తూనే ఉంటుంది. వరంగల్ ఆయన నివాసమైనప్పటికీ హైదరాబాద్ నగరంతోనూ ఆయనకు విడదీయరాని బంధముంది. భాషా, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన విశేష కృషి ఇక్కడినుంచే మొదలయింది.kaloji narayanarao

హైదరాబాద్‌లో వకాలత్ (లా) చదివే రోజుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆయనకు జూనియర్. 1935లో ఆయన తెలంగాణ వైతాళిక సమితిని ప్రారంభించారు. వెల్దుర్తి మాణిక్యరావు, వెంకట రాజన్న అవధాని, గంటి లక్ష్మీనారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన కళా సమితి ఆధ్వర్యంలో కవిత్వం, కథలు ప్రచురించేవారు. వేరు వేరు ప్రాంతాల నుంచి రచయితలను ఆహ్వానించి కవిత్వ పఠనం, కథా పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. నిజాంకాలంలో నగరంలో వెలిసిన అణా గ్రంథమాల, దేశోద్ధారక గ్రంథమాల వంటి ప్రచురణ సంస్థలు కాళోజీ సాహిత్యాన్ని ప్రచురించాయి.

 

కాళోజీ తెలంగాణ భాషపై కోస్తాంధ్ర భాష ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. తెలంగాణ పలుకుబడులకు ప్రాధాన్యమిచ్చాడు. ఆత్మకథను తెలంగాణ యాసలోనే రాశాడు. ప్రభుత్వం భాషకు సం బంధించి ఒక విధానాన్ని ప్రకటించక పోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రకటించాలి. తెలంగాణ భాషా నిఘంటు నిర్మాణానికి శాశ్వత ప్రాతిపతికన ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. జానపదుల నోళ్లలోని పదాలను, అన్ని వృత్తుల పదాలను, మాండలికాలను సేకరించాలి. తెలంగాణ ప్రామాణిక భాషను రూపొందించుకునే దిశగా సత్వర చర్యలు చేపట్టాలి.

పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ భాష అమలుకు నోచుకోకపోవడం పెద్ద లోపం. ఒక్క సంస్కృతి, సంప్రదాయాలే కాదు.. సాంఘిక శాస్త్రం, సైన్స్‌ వంటి బోధనాంశాల్లోనూ తెలంగాణం కనిపించాలి. అన్ని రకాల మాధ్యమాల కంటే ఇప్పటికీ సినిమాయే బలమైన మాద్యమంగా ఉంది. ఇంతకాలం విలన్‌ భాషకే తెలంగాణ యాసను పరిమితం చేసిండ్రు. ఇక నుంచైనా తెలంగాణ భాష, యాసలో మాట్లాడే హీరోలు ఉన్న సినిమాలు రావాలె. తల్లి భాష తెలంగాణ యాసను కాపాడుకునేందుకు అన్ని విధాలుగా కృషి జరగలవలసి ఉంది.
-డాక్టర్‌ కాలువ మల్లయ్య, రచయిత

- Advertisement -