ఇప్పటి వరకు ఎక్కువ ఏళ్లు జీవించిన వ్యక్తిగా ఫ్రాన్స్ కు చెందిన వృద్ధుడు జీయాన్నే కాల్మెంట్ (122) రికార్డుల్లోకెక్కాడు. కాల్మెంటే అనుకుంటే అతనికి సీనియర్ ఇంకో పెద్దాయన ఇండోనేషియాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు ఎమ్‌బా గోతా. ఈయన వయస్సు 145 ఏళ్లు. ఇండోనేషియాకు చెందిన అధికారులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం గోతా డిసెంబరు 31,1870లో సెంట్రల్ జావాలో జన్మించాడట. దీనిని నిరూపిస్తూ పలు డాక్యుమెంట్లు కూడా విడుదల చేశారు అధికారులు.
సెంట్రల్ జావాలోని స్రాగెన్‌కు చెందిన ఎంబా వయసు విషయం ఒక్కసారిగా బయటకు రావడంతో అతడు హీరో అయిపోయాడు. ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకునేందుకు మీడియా క్యూకడుతోంది. అయితే విచిత్రంగా ఈ వృద్ధుడు మాత్రం తాను చావుకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఎంబా మునిమనవడు సుర్యంటో మాట్లాడుతూ తాతకు 122 ఏళ్ల వయసున్నప్పటి నుంచి చావుకోసం ఎదురుచూస్తున్నారని తెలిపాడు. ఇప్పటికీ అది కరుణించలేదని పేర్కొన్నాడు. మరణం కోసం ఎదరుచూస్తున్నట్లు వెల్లడించాడు గోతా. అంతేకాదు తన కోసం స్మశానంలో స్థలం కూడా 20 ఏళ్ల క్రితమే కొన్నట్లు తెలిపాడు.
పూర్తిగా దృష్టి కోల్పోవడంతో ఎంబా రేడియో మాత్రం వినగలుగుతున్నారట. ఇంతకాలం జీవించడం వెనుక గల కారణాన్ని అడిగితే.. ఆహారం విషయంలో సహనం పాటించడం వల్లే అది సాధ్యమైందని ఎంబా పేర్కొన్నాడు. కాగా గతంలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన వారిలో నైజీరియాకు చెందిన జేమ్స్ ఒలోఫింటుయి 171 ఏళ్లు, ఇథియోపియాకు చెందిన దఖాబో ఎబ్బా 163 ఏళ్లు జీవించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఎంబా 145 సంవత్సరాలతో వారి సరసన చేరాడు.