ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతులకు చిక్కి.. వాళ్ల అకృత్యానికి బలై.. నెలల తరబడి బానిసగా నరకం అనుభవించిన 23 ఏళ్ల నదియా మురాద్…ఇప్పుడు ఎందరో నిస్సహాయులకు ప్రతినిధిగా ఉండబోతోంది. ఆమే నదియా మురద్. ఐఎస్ సెక్స్‌స్లేవ్ బతుకు నుంచి విముక్తి పొందిన నదియా.. ఐక్యరాజ్యసమితి రాయబారిగా ఎంపికైంది. మనుషుల అక్రమ తరలింపు అంశంపై ఆమె గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేయనుంది.
2014లో జరిగిన సంఘటనను యూఎన్ ముందు చెప్పుకొని ఏడ్చింది. నదియా ఏం చెప్పిందంటే.. “2014 ఆగస్టు 5న ఐసిస్ ఉగ్రవాదులు మేము నివాసముంటున్న గ్రామానికి వచ్చారు. ఇస్లాంలోకి మారండి లేదా చావండి అన్నారు. ఐతే ఎవరూ మతం మారేందుకు అంగీకరించలేదు. ఉగ్రవాదులు నా సోదరులతో సహా పురుషులను బయటకు లాక్కెళ్లారు. నా కళ్ల ముందే నా సోదరులను కాల్చి చంపారు. ఆ తర్వాత లోపలున్న తమను బయటకు ఈడ్చుకొచ్చి బందీలుగా చేశారు. నాతో సహా 150 మంది అమ్మాయిలను మోసుల్ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నాతోబాటు ఉన్న మహిళలందరినీ చిన్నచిన్న గదుల్లో బంధించారు.ఆ మహిళల్లో నా సోదరీమణులు కూడా ఉన్నారు.
ఆ తర్వాత నేనున్న గదిలోకి చాలామంది ఐసిస్ పురుషులు ప్రవేశించారు. ఆ తర్వాత ఆ గదికి లోపల తాళం పెట్టేశారు. వరుసగా అందరూ నాపై సామూహిక అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. అలా పగలు రాత్రి అనే తేడా లేకుండా రేప్ చేసేవారు. మమ్మల్ని జంతువుల కంటే హీనంగా చూశారు. అత్యాచారం చేస్తున్న సమయంలో అంగీకరించకపోతే క్రూరంగా గొడ్డును బాదినట్లు బాదేవారు. ఎలాగైనా ఈ నరకం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. అమెరికా సేనలు దాడులు జరుపుతున్న సమయంలో అవకాశం చూసుకుని తప్పించుకుని బయటపడ్డాను” అని యూఎస్ అంబాసిడర్ సమంత ముందు చెపుతూ బోరుమని కన్నీళ్లు పెట్టుకుంది నదియా.
అలా నెలల పాటు ఆ చీకటి ప్రపంచంలో మగ్గిన నదియా ఎట్టకేలకు అక్కడి నుంచి బయటపడి జర్మనీలో ఆశ్రయం పొందింది. అయినప్పటికీ ఆమెలో మనోధైర్యం చెక్కుచెదరలేదు. 2015లో ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌లో ప్రసంగించిన నదియా.. తాను గడిపిన బానిస బతుకును కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆమె ఆత్మస్థైర్యాన్ని మెచ్చి.. ఐరాస గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు.ఈమెను నోబుల్ శాంతి బహుమతి నామినీగా ఎంపిక చేశారు.