టీ, సమోసాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 9 కోట్లను ఖర్చు చేసిందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించాడు. ఈ ఖర్చు నాలుగు సంవత్సరాల కాలంలో ఈ ఖర్చు చేయడం జరిగిందని ఆయన తెలిపాడు. అతిథులు వచ్చినప్పుడు, అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు టీ, సమోసా, గులాబ్‌జామ్ వంటి స్నాక్స్ ఇవ్వడం పరిపాటి. ఇలా అఖిలేష్ ప్రభుత్వంలోని మంత్రులు వివిధ సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసిన ఖర్చు వివరాలను అసెంబ్లీలో బుధవారం సీఎం అఖిలేష్ స్వయంగా వెల్లడించారు.
రూ. 8,78,12,474లను అఖిలేష్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు 2012 మార్చ్ 15 నుండి 2016 మార్చ్ 15 వరకు ఈ ఖర్చు చేశారు.అత్యధికంగా మంత్రి అరుణ్‌కుమార్ కోరి ఈ నాలుగేళ్లలో 22,93,800 ఖర్చు చేశారు. ఆ తర్వాత స్థానంలో మంత్రి ఆజమ్‌ఖాన్ నిలిచారు. రూ.22 లక్షలు ఆయన స్నాక్స్ కోసం ఖర్చు చేశారు. మంత్రుల్లో సదాబ్ ఫాతిమా రూ.72వేలు ఖర్చు చేసి చివరి స్థానంలో నిలిచారు. అయితే ఒక మంత్రి సొంత రాష్ట్రంలో ఉన్నపుడు రోజుకు రూ. 2500, రాష్ట్రం దాటి వెళ్లినపుడు రూ.3000 వరకు ఖర్చు చేసుకునే వీలుందని సిఎం అఖిలేష్ యాదవ్ అన్నారు.
కాగా,వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం వెల్లడించిన ఈ లెక్కలపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాధనాన్ని అఖిలేష్ ప్రభుత్వం లూటీ చేసిందంటూ బీజేపీ ఆరోపించింది. ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాలను వదిలి అతిథి మర్యాదలంటూ ఇంత మొత్తంలో ఖర్చు చేయడమేంటని.. ప్రశ్నించింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధురి తమ మంత్రులను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సమావేశాలకు ఆయా నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున ప్రజలు హాజరైనందువల్లనే ఈ ఖర్చు అవుతుందంటూ వెనకేసుకొచ్చారు.