మనిషి కష్టాన్ని చూసి కదిలిపోయి, సాయం అందించే మంచి గుణం ఎంతమందికి ఉంటుంది.. చాలా తక్కువ మందికి మాత్రమే అని చెప్పాలి. సినిమా వాళ్లలో ఈ లక్షణం ఎంత మందికి ఉంటుందంటే అది ఇంకా తక్కువ మందికి అనే ఆన్సర్ వస్తుంది. చాలా అరుదుగా కనిపించే అలాంటి మంచి మనుషుల్లో, రాఘవ లారెన్స్ తప్పకుండా ఉంటాడు. కేరీర్లో చాలాకష్టపడి, డాన్స్ మాస్టర్ గా హీరోగా దర్శకుడిగా నిర్మాతగా ఎదిగాడు లారెన్స్.
కెరీర్ లో తనకంటూ ఒక స్థాయి వచ్చాక కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మొదలుపెట్టారు. ఎంతోమందికి గుండె శస్త్ర చికిత్సలు చేయించారు లారెన్స్. ఇప్పటి వరకూ 130 మందికి ఆర్థికసాయం ఆదించి శస్త్ర చికిత్సలు చేయించారు. తాజాగా అభినేష్ అనే కుర్రాడికి సాయపడ్డారు. అభినేష్ చాలా రోజులుగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న లారెన్స్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో సోమవారం నాడు అభినేష్ కి సాయం ప్రకటించారు. ప్రస్తుతం అభినేష్ ఆరోగ్యంగా ఉన్నాడని చెబుతున్నారు.
అనాథలు – వికలాంగులను ఆదుకునేందుకు ఆశ్రమాలను కట్టించిన సంగతి తెలిసిందే. అలాగే చాలామంది అభాగ్యులను దత్తత తీసుకుని వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తూ వారి పోషణ బాధ్యతల్ని తన కర్తవ్యంగా స్వీకరించారు లారెన్స్. తన తల్లిమీద ఉన్న అపారమైన ప్రేమకు చిహ్నంగా ఒక దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. త్వరలో ఆ ఆలయంలో తన అమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఈ ఆలయం కేంద్రంగా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని లారెన్స్ భావిస్తున్నారట.
ఇప్పటి వరకూ తన లైఫ్ లో చాలా సేవా కార్యక్రమాలు చేసిన లారెన్స్ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోవడం మాత్రం ఇష్టపడడు. అనాధలను దత్తత తీసుకుని చదివించడం, పేద వృద్ధుల్ని పోషించడం లాంటి ఎన్నో కార్యక్రమాల్ని చేస్తున్నా సింపుల్ గా ఉండడం లారెన్స్ కే సాధ్యపడింది. పక్క వాడు బాగుపడడం చూసి ఓర్వలేని మనుషులున్న నేటి కాలంలో తోటి మనిషిని ఆదుకోవడానికి తపనపడుతున్న లారెన్స్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..