తాము ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదనే విషయాన్ని గుర్తించుకోవాలని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. తమ బలాన్ని పరీక్షించుకునేందుకు విండీస్ పర్యటన చాలా చక్కగా ఉపయోగపడిందన్న కోహ్లి.. ఈ సిరీస్‌లో స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహాలు బ్యాటింగ్‌లో రాణించడం జట్టుకు సానుకూలాంశమన్నాడు. భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన నాలుగో టెస్టుకి వరుణుడు అడ్డుతగలడంతో మ్యాచు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. తమ వెస్టిండీస్ పర్యటన సంతృప్తినిచ్చిందని అన్నాడు. చివరి టెస్టు మ్యాచు డ్రా అయినా వెస్టిండీస్‌లో వచ్చిన ఫలితం ఎంతో సంతోషాన్ని నింపిందని వ్యాఖ్యానించాడు. ‘లోయర్ ఆర్డర్లో వచ్చి నిలదొక్కుకోవాలంటే కష్ట సాధ్యం. అయితే ఆ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన సాహా, అశ్విన్‌లు చక్కగా ఆకట్టుకున్నారు. మూడో టెస్టులో భారత కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు సెంచరీలతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇది మాకు అతి పెద్ద సానుకూలాంశం అనడంలో ఎటువంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్లో నిలకడ అనేది ప్రధానం. అది మా జట్టు ప్రదర్శనలో పూర్తిగా కనబడింది. ఈ సిరీస్‌లో విండీస్ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది’అని కోహ్లి తెలిపాడు.
చివరి టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియా తన నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయిన విషయంపై స్పందించిన కోహ్లీ తమ జట్టు ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదని వ్యాఖ్యానించాడు. కాగా, ఆగస్టు 27, 28న అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్, విండీస్ తలపడనున్నాయి.