రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అరెస్ట్‌..

132
Wrestler Sushil Kumar

జూనియ‌ర్ రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ కుమార్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో సుశీల్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అతనితో పాటు మరో అనుమానితుడు అజయ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. సాగర్‌ రాణా హత్య కేసులో విచారించేందుకు పోలీసులు వారిద్దరిని ట్రాన్సిట్ వారంట్‌పై ఢిల్లీకి తీసుకు వ‌స్తున్నారు.

కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగ‌ర్ రాణా దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. సుశీల్‌, సాగ‌ర్ వ‌ర్గీయుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో సాగ‌ర్ హ‌త్య‌కు గురైన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేల్చారు. అప్పటినుంచి అజ్థాతంలోకి వెళ్లిపోయిన సుశీల్‌ కుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న రెజ్ల‌ర్ సుశీల్ కుమార్‌పై ల‌క్ష రూపాయ‌లు, స‌హ‌చ‌రుడు అజ‌య్‌పై రూ.50 వేల రివార్డును కూడా ప్రకటించారు.

దీంతోపాటు గతవారం సుశీల్‌ కుమార్‌ అప్పీల్‌ చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను ఢిల్లీ రోహిణి కోర్టు కొట్టివేసింది. రెండురోజుల క్రితం పరారీలో ఉన్న సుశీల్‌ తన కారులో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌ టోల్‌ ప్లాజా కెమెరాలకు చిక్కిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీని ఆధారంగా చేసుకొని సుశీల్‌ కోసం వేట కొనసాగించిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు పంజాబ్‌లో అతన్ని అరెస్ట్‌ చేశారు.