రియో నుంచి ఎగ్జామ్స్‌కు…

201

ఊహించని రీతిలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. అంతర్జాతీయ వేదికపై తన విన్యాసాలతో అబ్బురపర్చింది. అత్యంత ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసాన్ని రెండుసార్లు ప్రదర్శించి ప్రపంచ స్థాయి జిమ్నాస్ట్‌లకు ఏమాత్రం తీసిపోనని రుజువు చేసింది. అర్హత పోటీలు మొదలుకొని ఫైనల్స్ వరకు తాను ప్రదర్శించిన సాహసోపేత విన్యాసాలకు క్రీడా ప్రపంచం మునివేళ్లపై నిలబడి సలామ్ చేసింది. శరీరాన్ని విల్లులా వంచుతూ గాల్లో బొంగరంలా గిరగిరా తిప్పుతూ పక్షిలా నేలకు మీదకు వాలినప్పుడు రియో మొత్తం చప్పట్లతో హోరెత్తిపోయింది. వాల్ట్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఒలింపిక్స్‌లో పతకం గెలవకపోయినా.. దేశ ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకుంది. దీప తన ఆటకు ఎంత ప్రాధాన్యమిస్తుందో చదువుకు కూడా అంతే విలువిస్తుంది అనడానికి నిదర్శనమే ఈ ఘటన. రియో నుంచి వచ్చిన మర్నాడే దీప తన ఎంఏ పరీక్షలకు హాజరైంది.రియో నుంచి ఇంటికి చేరుకున్న దీపా.. ఇంటికి రాగానే పుస్తకాలు తీసింది. ఇంటికి వచ్చిన మర్నాటి నుంచే ఆమెకు ఎంఏ పరీక్షలు ఉన్నాయి. త్రిపుర యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఆమె ఎంఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరైంది.
పరీక్ష హాలులో దీపను చూసిన అధ్యాపకులు, అధికారులు చదువు పట్ల ఆమెకున్న శ్రద్ధను చూసి తెగ మెచ్చుకున్నారు.పరీక్షలను ఎలా తప్పించుకోవాలా అని కారణాలు వెతికే విద్యార్థులు చాలా మంది ఉంటారని, అయితే దీప మాత్రం అలా చేయలేదని త్రిపుర యూనివర్శిటీ దూరవిద్య డైరెక్టర్‌ జమతియా అన్నారు. ఓ వైపు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నా… చ‌దువును మాత్రం ఎన్న‌డూ నిర్ల‌క్ష్యం చేయ‌లేద‌ని ..రియోకు త‌న‌తోపాటు పుస్త‌కాలు కూడా తీసుకెళ్లింద‌ని దీపా త‌ల్లిదండ్రులు వెల్ల‌డించారు.