ఖాకీల కాఠిన్యం మరోమారు బయటపడింది. గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో ఓ బాలుడి మెడకు టవల్ చుట్టి ఈడ్చుకెళ్ళిన రైల్వే కానిస్టేబుల్ ప్రతాపం మరువక ముందే… బీహార్ పోలీసుల అమానుషత్వం వెలుగులోకి వచ్చింది.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. ఈ ఘటన బీహార్లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. వైశాలి జిల్లాలో గంగానదిలో ఓ మృతదేహం గ్రామస్తుల కంటపడింది. వెంటనే ఆ మృతదేహాన్ని గట్టుకు తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రెండు గంటల తర్వాతా తాపీగా ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాం మెడకు తాడు కట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి వారి వాహనంలో పడేశారు. ఈ ఘటనను అక్కడే ఉన్నవారు తమ సెల్ఫోన్లలో బంధించారు. ఈ వీడియో బయటకు పొక్కడంతో బీహార్ పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వీడియో వివరాలు వైరల్ కావడంతో పై అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఘటనకు కారణమైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇదే జిల్లాలో కొన్నేళ్ళక్రితం జరిగిన ఘటనలో కొందరు అల్లరిమూకల కారణంగా మృతి చెందిన పదిమందిని దహనం చేయాలని పేర్కొన్నా… పోలీసులు వారిని నదిలో విసిరేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటువంటి ఘటనలెన్నో పోలీసుల కాఠిన్యానికి నిదర్శనంగా నిలవడంతోపాటు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.అక్కడున్న జనం ఇంత జరుగుతున్నా కళ్లప్పగించి చూశారే తప్ప నోరు మెదపకపోవడం మానవత్వం చచ్చిపోయిందనడానికి నిదర్శనం.