మంత్రి ఈటల, సీఎస్‌ లను అభినందించిన కేటీఆర్‌..

135
ktr
- Advertisement -

ఆక్సిజన్ కొరత తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ను తెప్పించుకుంటోంది. అందుకు దేశంలోనే తొట్టతొలిసారిగా యుద్ధ విమానాలనూ వాడుకుంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి 8 ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను యుద్ధ విమానాల్లో ఒడిశాకు పంపించింది.

మూడునాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్‌టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్నచిన్న ఆక్సిజన్‌ ప్లాంట్ల నుంచి ఉన్నా యి. మిగిలిన ఆక్సిజన్‌ను బళ్లారి, భిలాయ్‌, అంగుల్‌ (ఒడిశా), పెరంబుదూర్‌ నుంచి తీసుకోవాలని సూచించింది.

తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్‌ప్లాంట్‌ నుంచి కేటాయించింది 20 మెట్రిక్‌ టన్నులే. వైజాగ్‌ నుంచి దాదాపు ఇంతే కేటాయించారు. భిలాయ్‌, పెరంబుదూర్‌, అంగుల్‌ నుంచి ఆక్సిజన్‌ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ రావడానికి కనీసం మూడు రోజులు పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను వినియోగించుకుంటుంది రాష్ట్రం.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు దగ్గరుండి ఈ వ్యవహారాలు చూసుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆక్సిజన్ ట్యాంకర్లను యుద్ధ విమానాల్లో తరలించే ఏర్పాట్లను పరిశీలించారు. ఆక్సిజన్ ను తరలించేందుకు యుద్ధ విమానాలను వాడుకున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

కాగా,మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్ లను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆక్సిజన్ రవాణాలో మూడు రోజుల కాలాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నో ప్రాణాలను నిలబెట్టడం కోసం యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ను తరలించడం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన ట్వీట్ చేశారు. అత్యంత వేగంగా ఒడిశా నుంచి ఆక్సిజన్ ను తీసుకొచ్చేందుకు మంత్రి, సీఎస్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -