భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. గంగానది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. వారణాసిలో ఘాట్లు మునిగిపోవడంతో అంత్యక్రియలు భవన పైభాగంలో నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వరదల కారణంగా యూపి, బీహార్‌లో 30 మంది మృతి చెందారు. వరద పరిస్థితిని చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చలించిపోయారు. నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్రమోదిని కలిసారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిని వివరించి సహాయం అందించాలని కోరారు.
అయితే నితీష్ కుమార్ ప్రభుత్వానికి మిత్రపక్షమైన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తన కొడుకు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌తో కలసి వరద ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లినపుడు గంగ మీ ఇళ్లకు రావడం అదృష్టమంటూ వరద బాధితులను ఉద్దేశించి లాలు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.
‘చాలా సందర్భాల్లో మీరే గంగానది దగ్గరకు వెళ్తారు. అలాంటిది గంగ మీ ఇళ్లకు రావడం మీ అదృష్టం. ఇది ఎప్పుడో కానీ జరగదు. పవిత్రమైన గంగా జలం ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతోంది? గత దశాబ్దంకాలంగా గంగ మన నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ మనదగ్గరకు వచ్చింది’ అని నది స్వచ్ఛత గురించి సెలవిచ్చారు లాలూ. ఆయన మాటలకు మీడియా ప్రతినిధులు, వరద బాధితులు అశ్యర్య పోయారు.