పశ్చిమ రంగారెడ్డి పచ్చబడాలె…

109

రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలబడుతోందని.. రైతుల కోసం 9 గంటలు నాణ్యమైన కరెంట్ పగటి పూట ఇస్తున్నమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని తాండూరులో జనహిత సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని, ఇటువంటి ఎన్నో అపోహలు కల్పించారు. సంక్షేమ రంగంలో ప్రభుత్వం దూసుకుపోతుంది. ఏడాదికి 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నం. 4 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు వెయ్యి చొప్పున పెన్షన్ అందిస్తున్నం. ఒంటరి మహిళలకు నెలకు రూ.వెయ్యి జీవన భృతి ఇస్తున్నం. ఇంట్లో ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నం. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నం. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లలకు రూ.75వేలు ఇస్తున్నం. గర్బిణీ స్త్రీల అవసరాల కోసం రూ.12వేల ఆర్థిక సాయం చేస్తున్నం. 13 రకాల వస్తువులతో చిన్న పిల్లలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నం. 40వేల కోట్లు పేదల సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నామని తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడేవాళ్లు. ఎరువులు, విత్తనాలు పోలీస్‌స్టేషన్లో పంచాల్సిన పరిస్థితి ఉండేది. రంగారెడ్డి జిల్లా రైతాంగంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల కోసం రూ.35 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమ రంగారెడ్డిని సస్యశ్యామలం చేస్తాం. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే గమ్మత్ అనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్న ఇంతకాలం గుడ్డి గుర్రాల పండ్లు తోమారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో కూర్చొని గడ్డం పెంచుకుని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు కట్టకుండా కోర్టుల్లో కేసులు వేస్తూ, అడ్డుపడుతూ రైతుల నోళ్లలో కాంగ్రెస్ మట్టికొడుతోందని మండిపడ్డారు. మిషన్ కాకతీయతో పంటలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఇంటింటికీ తాగునీరు- కోటి ఎకరాలకు సాగునీరు నినాదంతో ముందుకు పోతున్నాం. చేతివృత్తులకు, కుల వృత్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేజీటూ పీజీ పథకంలో భాగంగా గురుకుల విద్యాలయాలు పెట్టి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తమకు భవిష్యత్ లేదన్న భయంతోనే కాంగ్రెస్ నాయకులు నిజరూపం బయటపెట్టుకుంటున్నారు. పాలమూరు పచ్చబడ్డట్టే… పశ్చిమ రంగారెడ్డి కూడా పచ్చబడాలని ఆకాంక్షించారు.

తాండూరు రూపురేఖలు మారుస్తాం. తాండూరు పట్టణాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని హామి ఇచ్చారు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, కేటీఆర్, నాయకులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.