నల్లమలలో నయీం డంప్ లు

430
Nayeem dumps in Nallamala
Nayeem dumps in Nallamala

గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అక్రమార్జన ఎల్లలు దాటినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇప్పటి దాకా బయటపడ్డ డబ్బు మొత్తం ఆర్జనలో పది శాతం కూడా కాదని పోలీసు వర్గాలు అంటున్నాయి. వారిచ్చిన వివరాల ప్రకారం… నయీం కు చెందిన ముగ్గురు అత్యంత సన్నిహిత అనుచరులు ఎన్ కౌంటర్ కు ముందే తప్పించుకుపోయారు. వారు నల్లమల అడవుల్లో ఓ గుప్త ప్రదేశంలో భారీగీ డబ్బు, బంగారం దాచినట్లు సమాచారం.

గ్యాంగ్ స్టర్ నయీం కిడ్నాప్ లు, దందాలతో వసూలు చేసిన కోటాను కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయి.. ఎక్కడ దాచాడు.. కొంత డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసినా.. మిగతా నగదు ఎక్కడ ఉందనేది సిట్ అధికారులను సైతం ఆసక్తి రేపుతోంది. నయీం గ్యాంగ్ ఎక్కువగా నగదు, బంగారం రూపంలో వసూళ్లు చేసేది. నయీంకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇళ్లు, గెస్ట్ హౌస్ లు, గ్యారేజీల్లో తనిఖీ చేసినా కట్టలకొద్దీ డాక్యుమెంట్లు దొరికాయి తప్ప.. డబ్బు మాత్రం పెద్దగా దొరకలేదు. ఇక నయీంకు బంగారంపైనా బాగా మోజు. తనిఖీల్లో అది కేజీల్లోనే దొరికింది. విచారణలో ఆయన అనుచరులు చెప్పిన విషయాలతో వందల కిలోల బంగారం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డబ్బు అయితే కోట్ల కట్టలు భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఆ నిదులు ఎక్కడ ఉన్నాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు.

ప్లాస్టిక్ డ్రమ్ముల్లో అంటే కెమికల్స్, పెట్రో ప్రాడక్స్ట్ రవాణా కోసం వాడి ఆ తర్వాత ఇళ్ళలో నీళ్ళ స్టోరేజికి ఉపయోగించే డ్రమ్ముల్లో డబ్బు కట్టలు పెట్టి నల్లమలకు రవాణా చేసేవారని తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టయిన ఒకరిద్దరు  ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి మహబూబ్ నగర్ ను ఆనుకుని ఉన్న నల్లమల అటవీప్రాంతంలో కదలికలపై నిఘా వేశారు.

మరో సంచలనాత్మకమైన నిజం ఏంటంటే నయీం కేవలం డబ్బు ఇక్కడ దాచడమే కాక, హవాలా ద్వారా ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు చేర్చి భారీ ఎత్తున వజ్రాలు కొనుగోలు చేశాడని..! పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం దుబాయ్ లో అతని వజ్రాలు కొన్ని బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల్లో ఉన్నట్లు తెలుస్తున్నది.  ఆ వజ్రాలను నయీం అక్కడే కొన్నట్లు కూడా అధికారుల దర్యాప్తులో వెల్లడయ్యింది.  ఎక్కడెక్కడ వాటిని దాచాడు, వాటి వివరాలేంటి, గోవా నుంచి అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్ళాడు, అతనికి పాస్ పోర్టు ఇచ్చి సహకరించినదెవరు..మొదలైన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.