తీపి లేని తిరుపతి లడ్డు…

455

తిరుమల వెంకన్నను లిప్త కాలంపాటు దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు స్వామి వారి ప్రసాదం లడ్డు కోసం క్యూలు కడుతుంటారు. ఎంతో అపురూపంగా కళ్లకు అద్దుకుని గోవిందా అంటూ స్వామివారి లడ్డూను ఆరగించే భక్తులు అంతటితో స్వామి దర్శనం పరిపూర్ణం అయిందని భావిస్తారు. తిరుమలకు వెళ్లి వచ్చామని అనగానే ఎవరైనా వారిని అడిగేది లడ్డూ ప్రసాదం తెచ్చారా అనే మాట. అందుకే లడ్డూలను భక్తులకు అందించడంలో తితిదే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. స్వామి వారికి ఏవిధమైన ప్రపంచ ఖ్యాతి ఉందో తిరుమల శ్రీవారి లడ్డూకు కూడా అదే స్థాయి ప్రాముఖ్యత ఉంది. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఇప్పటికి లడ్డు కి డిమాండ్ ఎంతో ఉంది. ఇరవై ఏళ్ళ క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మే వారు.ఇపుడు ఆ సదుపాయం లేదు. ఇక లడ్డు లో నాణ్యత కూడా తగ్గిపోయింది. అయితే అప్పటి లడ్డు కి ఇప్పటి లడ్డు కి చాలా తేడా ఉంది.

thehindu_1438866678

పల్లవుల కాలం నాటి నుంచే శ్రీవారి ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి. రెండవ దేవరాయ కాలంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన శ్రీవారి ప్రసాదాలాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. శ్రీవారి ప్రసాదాలను మొదటగా తిరుప్పొంగంగా పిలిచేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం మొదలైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 1950 నుంచి లడ్డూల్లో వాడే సరుకుల మోతాదును టిటిడి నిర్దేశించింది. ఈ లడ్డూలు తయారుచేయడానికి ఆవు నెయ్యి , శనగపిండి , చక్కెర ముంత మామిడిపప్పు ఎండుద్రాక్ష, కలకండ , ఏలకులను వినియోగిస్తారు.

Laddu prasadam for Vaikunta Ekadashi 2015, Enarada.com

తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల)కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. తిరుమలేశుని లడ్డు, ప్రసాదాల తయారీకి దేవస్థానం సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ముడిపదార్థాన్ని కొనుగోలు చేస్తున్నది . ఇందుకోసం టీటీడీ ఏటా సుమారు రూ.180 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తోంది. వీటిలో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం.

శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్డూలు మూడురకాలుగా తయారు చేస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది.

20091023262110102

ఇక అందరికీ అందుబాటులో ఉండే శ్రీవారి లడ్డూ 75 గ్రాముల బరువు ఉంటుంది. ఈ లడ్డూ తొలుత 8 అణాల నుంచి కాలక్రమేణా రూ. 2 ఇప్పుడు రూ. 25కి చేరింది. 2009 సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్ లభించింది. దీనితో టిటిడి మాత్రమే శ్రీవారి లడ్డూ తయారీ భాగ్యాన్ని దక్కించుకున్నట్లయింది.

laddu

అయితే పూర్వకాలంలో ఉన్న లడ్డూకు నేటి లడ్డూకి తీపిలో తేడా తగ్గిపోతుంది. లడ్డూల సైజు రోజుకోరకంగా తగ్గిపోతుంది. అంతేకాదు నాణ్యత కూడా అంతంతమాత్రంగా తయారైందన్న విమర్శలు వినబడుతూనే ఉన్నాయి. ప్రతి వెయ్యి లడ్డూల్లో ఏదో ఒక చెత్త కనిపిస్తుండటం ఇందుకు ఉదాహరణ. గత కొన్ని నెలలుగా గమనిస్తే లడ్డూలలో బొద్దింకలు, బోల్టులు దర్శనమిచ్చి భక్తులను వెక్కిరిస్తున్నాయి. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూలను తయారుచేసే సమయంలో కార్మికులు పరిశుద్ధంగా ఉండకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తితిదే అధికారులు లడ్డూల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు.

bolt in ttd laddu