డ్రగ్స్‌ వ్యవహారంపై కంగనా షాకింగ్ కామెంట్స్‌..

43
Kangana

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా డ్రగ్స్‌ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో చాలా మంది డ్రగ్స్‌ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు నటి కంగనా రనౌత్‌. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కంగనా డ్రగ్స్‌ తీసుకుంటారని ఆరోపించారు. అధ్యాయన్ సుమన్‌తో తనకు సంబంధాలున్నాయని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, అతడిని కూడా బలవంతం చేసినట్లు ఒక ఇంటర్యూలో కంగనా చెప్పారని అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేశారు. ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారని అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీల్ ప్రభు అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పినట్లు ఆయన తెలిపారు. దాంతో కంగనా దీనిపై స్పందించారు.

ఈ క్రమంలో తాను డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే ముంబైని విడిచిపోతానని సవాలు చేశారు కంగనా రనౌత్. హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, ముంబయి పోలీసుల ఆదేశాలను సంతోషంగా స్వీకరిస్తానని తెలిపారు. కావాలంటే తనకు డ్రగ్ టెస్టులు చేసుకోవచ్చని, తన కాల్ రికార్డులు పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల విక్రేతలతో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే తన తప్పును అంగీకరించి ముంబయిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోతానని స్పష్టం చేశారు. త్వరలోనే ముంబయి పోలీసులను, హోంమంత్రిని కలిసేందుకు ఎదురుచూస్తున్నానని కంగనా వెల్లడించారు.