కృష్ణం వందే జగద్గురుం..

292

భక్తకోటిని పులకింపజేసే పర్వదినాలలో కృష్ణాష్టమి విశిష్టమైనది. కంసుని చెరసాలలో బంధీగా పుట్టిన కృష్ణయ్య కాంతల కౌగిల్లలోనూ బందీ అయ్యాడు. భక్తుల హృదయాలలోనూ బందీగానే ఉన్నాడు. హే కృష్ణా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు.. పలికే దైవం కన్నయ్య.. నేడు శ్రీకృష్ణాష్టమి..

బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్ళల్లోకి తన స్నేహితులతో వెళ్లి తనకిష్టమైన పాలు, పెరుగు, వెన్న దొంగిలించేవాడు. తను తిని అందరికీ పెట్టేవాడు. ఆ కృష్ణపరమాత్మ తన స్నేహితులను నేలమీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న, పెరుగులకోసం ఉట్టీలను అందుకొనేవాడు. ఆ కృష్ణలీలను గుర్తుచేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టీలు కొట్టడం.

కృష్ణుడి మాట ఏ నోట విన్న చిన్నప్పుడు చదువుకున్న చేతి వెన్న ముద్ద, చెంగల్వ పూదండ పద్యం గుర్తుకురాక మానదు. మన చిన్నప్పటి నుంచే మనకు కన్నయ్యతో బంధం పెనవేసుకున్నదన్న మాట. మనిషి సమస్యలకు గీతతో పరిష్కారం చూపిన కృష్ణయ్యను ఆరాధించే వారికి ఆనాడే కాదు.. ఈ నాటికి పరిష్కారాలు లభిస్తూనే ఉంటాయి. అందుకే ఆపదలో ఉన్న వారంతా ఆ దేవదేవుని శరుణు వేడి ఊరట చెందుతూ ఉంటారు.

ఆపదలో ఆదుకునే దైవం కృష్ణయ్య.. అందుకే కృష్ణాష్టమి నాడు ఆ బాలగోపాలం కన్నయ్యను ఆరాధించి తమ కోరికలు తీరాలని వేడుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఆ గోపాలుడి దీవెనలు లభిస్తూ ఉంటాయి. కృష్ణయ్య అంతటి భక్త సులభుడు కాబట్టే ప్రతి తల్లి తన పిల్లలకు ఆ నల్లనయ్య ఆశిస్సులు లభించాలని కోరుకుంటోంది.

శ్రీ మహావిష్ణువు అంశతో పుట్టిన శ్రీ కృష్ణుడు భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. చిన్నికృష్ణునిరూపంలో తలిచిన, గీతాచార్యునిగా ధ్యానించినా, ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో దర్శనమిచ్చే దేవుడు కన్నయ్య.  ఏ కృష్ణయ్యా అంటూ పుండరీకుడు పిలవగానే పలికిన దేవుడు చిన్ని కృష్ణయ్య.

దేవకి పంటగా వెలసిన కృష్ణయ్య యశోద ఇంట పెరిగి పెద్దవాడయ్యాడు. తల్లులకు,చెల్లెల్లకు ప్రేమను పంచే ఆ దేవదేవుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డగా ఎదిగాడు. కన్నతల్లి దేవకి దేవీ అయినా యశోద ఇంట పెరిగి ఆ తల్లి ప్రేమను సొంతం చేసుకున్నాడు.

యశోదమ్మ బిడ్డడుగా పెరిగిన కన్నయ్య చేష్టలు అన్నీ ఇన్నీ కావు. వెన్నెదొంగ, మధురలో చేసిన చిలిపి చేష్టలకు కొదవే లేదు. యశోదమ్మకు గోపికలు రోజూ ఫిర్యాదు చేసేవారట. ఆ విషయం వింతగా కల్లింతలు చూసుకునేలా సాగేది.

కన్నయ్య వెన్నదొంగే కాదు.. కన్నెల మనసులను దొంగిలించడం లోనూ మిన్న. ఆనాడు వేలవేల భామల కలల రేడు కన్నయ్య. సాక్ష్యాత్తు లక్ష్మీ స్వరూపిని అయిన రుక్మిణి దేవి పట్టమనిషిగా చేసుకుని మురిసిన ఘనుడు ఆయనే. రుక్మిణి, శ్రీకృష్ణుల ప్రణయ గాధ సైతం పులకింపజేస్తూనే ఉంటుంది. కేవలం మనసుదోచే దొంగే కాదు.. అన్నాఅని పిలిచిన వారిని ఆదుకునే కరుణామూర్తి కూడా ఆయనే. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే కొండంత దైవం కృష్ణయ్యే. ఆ సత్యం తెలిసిన ద్రౌపది ఆపదలో ఈ అన్నయ్యను ఆ దుకోమని పిలిచింది. ఆ కృష్ణయ్య లీలలు అన్నీ ఇన్నీ కావు.. తానే జీవాన్ని సృష్టిస్తాడు.. దానిని ఆడిస్తాడు.. పాడిస్తాడు.. ఓడిస్తాడు.. పరీక్షిస్తాడు.. కరుణిస్తాడు.. ఇలా ఎన్నో వింతలను చేయడంలో కన్నయ్యను మించిన వారు లేరు.

రాయబారి అవుతాడు.. రథసారధిగా ఉంటాడు.. గీతను భోదిస్తాడు.. అన్నీ ఆయన మాయలో భాగాలే..శ్రీకృష్ణుని లీలలు అనంతమైనవి. ద్వాపర యుగంలోనే కాదు.. తర్వాతి యుగాల్లోనూ కృష్ణయ్య లీలల్లో తడిసి ముద్ధయ్యారు ఎందరో భక్త శిఖామణులు. అందుకే కృష్ణయ్య పుట్టిన రోజు పండుగను తరతరాలుగా అందరికి ఆనందం పంచుతూనే ఉంది.

భారతీయులు ఎక్కడ ఉన్న భారతీయులే.. ఆ మాటకొస్తే మనదేశంలో ఉన్న వారి కంటే విదేశాల్లోఉన్న వారికే మన సంస్కృతి, సాంప్రదాయాలంటే మక్కువ ఎక్కువ. తరాలు మారిన తరగని భక్తితో భారతీయులు అతి పవిత్రంగా భావించే కృష్ణ జయంతి ప్రతి ఏడాది శతకోటి భక్తులను ఆనంద సాగరంలో మునకలేయిస్తుంది.