ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ కూడా వారితో పాటు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన కార్యక్రమానికి మోదీ,దీదీ హాజరయ్యారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ విమర్శలు చేసుకుంటున్న ఈ ఇద్దరూ ఒకే వేదికపై ఆసీనులు కావడం ఆసక్తికరంగా మారింది.
అంతకు ముందు బోస్ పూర్వీకుల ఇంటికి మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి బోస్ మనవళ్లు సుగతో, సుమంత్రో సాదరంగా ఆహ్వానం పలికారు. నేతాజీ చిత్ర పటానికి మోదీ నివాళి అర్పించారు. ఆయన ఉపయోగించి కారు, మంచం, టేబుల్ తదితర వస్తువులను ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత జాతీయ లైబ్రరీని సందర్శించారు. అనంతరం విక్టోరియా మెమోరియల్ కు చేరుకున్నారు. అదేవిధంగా ఇదే రోజు పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్యాం బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు పాదయాత్ర చేశారు. నేతాజీకి ఘన నివాళులు అర్పించారు. పాదయాత్రలో మమతకు తోడుగా వేలాది మంది తరలివచ్చారు.