అంతా బ్రాంతియేనా…?

587
- Advertisement -

లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా రావడం అంటే ఇదేనేమో. మార్కెట్‌లోకి పూర్తి స్థాయిలో రాక‌ముందే రిల‌య‌న్స్ జియో 4జీ సంచలనాలు సృష్టిస్తోంది. క‌నీ వినీ ఎరుగ‌ని స్పీడ్‌తో అత్యంత త‌క్కువ ధ‌ర‌కే హై స్పీడ్ డేటా, వాయిస్ కాల్స్‌ను అందిస్తుండ‌డంతో మొబైల్ వినియోగ‌దారులు ఇప్పుడంతా రిల‌య‌న్స్ జియో 4జీ వైపే చూస్తున్నారు. దీంతో చాలా మందిలో ఈ సంస్థ సేవ‌ల ప‌ట్ల ఆస‌క్తి బాగా పెరిగింది. ఈ క్ర‌మంలో ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్లు కూడా త‌మ త‌మ వినియోగ‌దారుల‌ను చేజార్చుకోవ‌ద్ద‌నే ఉద్దేశంతో డేటా చార్జిల‌పై రేట్లను భారీగా త‌గ్గించాయి.

90 రోజుల ప్రివ్యూ ఆఫర్‌, అంద‌రికీ హైస్పీడ్ 4జీ సేవ‌లు ఫ్రీ అంటూ సంచ‌ల‌నం రేపుతున్న రిల‌య‌న్స్ జియో ఇప్పుడు టెలికామ్ రంగంలో చిచ్చు రేపింది. త‌న వాణిజ్య సేవ‌ల‌ను ప్రారంభించ‌కుండా విలువైన 4జీ సేవ‌ల‌ను ఉచితంగా ఇవ్వ‌డం త‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలాంటి ఇత‌ర ఆప‌రేట‌ర్లు వాదిస్తున్నారు. జియో త‌న వాణిజ్య సేవ‌ల‌ను మ‌రికొన్ని నెలల్లో ప్రారంభించ‌బోతోంద‌ని కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించారు. అయితే ఆలోపు సాధ్య‌మైనంత మంది ఎక్కువ క‌స్ట‌మ‌ర్ల‌ను ఇత‌ర ఆప‌రేట‌ర్ల నుంచి జియో వైపు మ‌ళ్లించ‌డానికి ఉచితం అనే ఆయుధాన్ని ప్ర‌యోగించింది రిల‌యెన్స్‌.

Rjio-mukesh

దీంతో రిలయన్స్ తీసుకున్న నిర్ణయం…మిగితా టెలికాం ఆపరేటర్లకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మరోవైపు 90 రోజులు ఫ్రీ సర్వీస్‌ అంటు ప్రకటించిన రిలయన్స్‌ తర్వాత సంగతి ఏంటనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. కాల్‌ ఛార్జీలు,డాటా,ఇతర ప్యాక్‌లపై వివరాలను వెల్లడించలేదు. గతంలో రిలయన్స్‌ టెలికం రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లనే ప్రకటించింది. కేవలం రూ.1కే ఫోన్ అందించి సంచలనం సృష్టించిన….తర్వాత అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా రిలయోన్స్ జియో పేరుతో మరోసారి మార్కెట్‌లోకి వస్తున్నా…..తర్వాత వినియోగదారుల పరిస్థితి ఏంటనే విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు.

మరోవైపు ఇతర టెలికం సంస్థలు…..రిలయన్స్‌పై ఫిర్యాదుచేసింది. ప్రి లాంచ్ మోడ్‌లో ఉన్నామంటూ రిల‌యెన్స్ ఉచితంగా 4జీ ఎయిర్‌వేవ్స్‌ను వాడుకోవ‌డం వ‌ల్ల ఇప్ప‌టికే వాణిజ్య సేవ‌లు అందిస్తున్న ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ల‌తోపాటు ప్ర‌భుత్వం కూడా తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోతున్నాయ‌ని సెల్యూల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ప్ర‌ధాని కార్యాల‌యానికి ఫిర్యాదు చేసింది. బీటా టెస్టింగ్ పేరుతో విలువైన వాణిజ్య సేవ‌ల‌ను ఉచితంగా ఇవ్వ‌డం సరికాద‌ని అసోసియేష‌న్ వాదిస్తోంది.

Reliance-Jio

మరోవైపు ఇప్పటికే రిలయన్స్‌ జియో వాడుతున్న కస్టమర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది రిలయన్స్ సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం పెదవివిరుస్తున్నారు. వాయిస్ కాల్స్ బాగా డల్ గా ఉన్నాయని…..ఇతర నెట్ వర్క్‌లకు జియో సిమ్‌తో కాల్ చేస్తే కనెక్టవడం లేదని వాపోతున్నారు.

అయితే ఇత‌ర ఆప‌రేట‌ర్లు, అసోసియేష‌న్ తీరును రిల‌యెన్స్ త‌ప్పుబడుతోంది. అసోసియేష‌న్ మిగ‌తా ఆప‌రేట‌ర్లను వెన‌కేసుకువ‌స్తోంద‌ని, దీనిపై తాము కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించింది. మొత్తంగా ఫ్రీ పేరుతో మార్కెట్లోకి వచ్చిన జియో…..సంచలనానికి కేంద్రబిందువైంది.

- Advertisement -