శ్రీదేవి మరణంపై ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన చెప్పారు. శ్రీదేవి తమ ఇంట్లో పెరిగిన పిల్ల అని ఆయన అన్నారు. చెన్నైలో తమ ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు ఉండేదని ఆయన చెప్పారు. ఆమె తనతోనే అత్యధికంగా 31 చిత్రాలు చేసిందన్నారు. ఆమె మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ఆయన చెప్పారు. తన కుమారుడు నరేశ్, శ్రీదేవి చిన్ననాటి స్నేహితులని ఆయన అన్నారు.
మరో నటుడు కృష్ణంరాజు కూడా ఆమె గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఆమె మరణంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మహా నటీమణులు సావిత్రి, భానుమతి మినహా శ్రీదేవి మాదిరిగా నటించే వారు ఎవ్వరూ లేరని ఆయన కొనియాడారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటిని కోల్పోయిందని ఆయన అన్నారు.
శ్రీదేవి మరణంపై మెగాస్టార్ చిరంజీవి కూడా తన భాదను వ్యక్తం చేశారు..అందం, అభినయం కలబోసిన అద్బుతమైన నటి, అతిలోకసుందరి శ్రీదేవి అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శ్రీదేవి లాంటి నటి గతంలో ఎవరూ లేరని, భవిష్యత్తులో వస్తారని కూడా తాను భావించడం లేదని చెప్పారు. మా అతిలోక సుందరి ఈ విధంగా అనంతలోకాలకు వెళ్లిపోయిందంటే… తనకు మింగుడు పడటం లేదని అన్నారు. ఇదొక చేదు నిజమని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు చాలా అన్యాయం చేశాడని… ఇంత చిన్న వయసులోనే ఆమెను తీసుకెళ్లిపోయాడని అన్నారు. చిన్నతనం నుంచి శ్రీదేవికి నటన తప్ప మరొకటి తెలియదని… మరో ధ్యాస, మరో వ్యాపకం ఆమెకు లేదని చెప్పారు. అంతటి అంకితభావం ఉన్న నటీమణిని మనం చూడలేమని తెలిపారు.