లంబోదరుడు, హేరంబుడు, గజాననుడు, ఏక దంతుడు, మూషిక వాహనుడు.. ఇలా పేరేదేనా.. ఏ ఆపద వచ్చినా పిలుచేది ఆ వినయకున్నే. తాను స్వయంభువుగా ఆవిర్భవించిన ఆలయాల్లోనే కాదు, ఇతర దైవ క్షేత్రాల్లోనేూ తనదైన ప్రత్యేక స్థానంలో కొలువై కనిపిస్తుంటాడు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే దైవాల్లో వినాయకుడే ముందువరుసలో కనిపిస్తుంటాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కాకుండా మట్టి వినాయకులను ప్రతిష్టించాలని పర్యావరణ వేత్తలు,ప్రభుత్వాలు విస్తృత ప్రచారం జరిపాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో లంబోదరుడు వివిధ రూపాల్లో ప్రజలకు దర్శనం ఇస్తు కనువిందు చేస్తున్నాడు.
తమిళనాడులో పైనాపిల్ గణేశుడు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ గణేశున్ని తయారు చేశారు. మొత్తం అనాస పండ్లతోనే విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం తయారీ కోసం నిర్వాహకులు వేల సంఖ్యలో పైనాపిల్ పండ్లను వాడారు. మండపంలో కొలువుదీరిన గణనాధున్ని చూసేందుకు ప్రజలు కోకొల్లలుగా తరలివస్తున్నారు.
ఈ క్రమంలో గణేశ్ మండపాల నిర్వాహకులు కాస్త వైవిధ్యంగా ఆలోచించి… విభిన్న రూపాల్లో విఘ్నాధిపతిని ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో నెలకొల్పిన ట్రాఫిక్ వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ యూనిఫారం వేసుకున్న గణనాథుడు ట్రాఫిక్ పై అవగాహనను మరింత పెంచుతున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ యూనిఫారంలో ఉన్న నాలుగు వినాయక విగ్రహాలను మండపంలో ఏర్పాటు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంలోని పెద్దలకు సద్భుద్ధి ప్రసాదించాలంటూ తిరుపతిలోని డీఆర్ మహల్లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంటును తలపిస్తూ ప్రత్యేక సెట్ వేసి ప్లకార్డులు చూపినట్లు మండపాన్ని సిద్దం చేశారు. స్పీకర్‌తో సహా అన్ని పార్టీల నేతలను వినాయకుడి రూపంలో చూపించారు. మొత్తం 11 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఈ వినాయక మండపాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.
వినాయక ఉత్సవాల్లో భాగంగా కర్నూల్ జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన హరిత గణపతి అందరిని ఆకట్టుకుంటున్నాడు. పర్యావరణ పరిరక్షణ , ప్రజలలో, యువతలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం,వారికి ఆవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ హరిత గణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సెలబ్రిటీలు సైతం సిద్ధమయ్యారు. ఇప్పటికే మట్టి వినాయకుడు, గ్రీన్ గణేష్ లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ నేపథ్యంలోనే పేపర్ గణేష్ కూ పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఈసారి వీటిని భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని పలు కార్పొరేట్ సంస్థలు, ఎఫ్ ఎం రేడియో నిర్ణయించాయి.