కోటి ఇళ్లకు నల్లా నీరు

182
cm kcr
cm kcr
- Advertisement -

వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు చేరేలా మిషన్‌ భగీరథ పనులు జరగాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, అంతర్గత పైపులైన్లు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అన్ని పనులు సమాంతరంగా జరగాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ మిషన్‌ భగీరథపై సీఎం కేసీఆర్‌ సమీక్షా నిర్వహించారు.

kcr

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథలో భాగంగా గజ్వేల్‌ నియోజకవర్గంలో 66, 800 ఇండ్లలో నల్లాలు పెట్టి ప్రస్తుతం నీరందిస్తున్నారని, గతంలో చేసిన ప్రయత్నాల వల్ల సిద్ధిపేట నియోజకవర్గంలో కూడా మంచినీళ్లు అందుతున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోని దాదాపు కోటి ఇండ్లకు నల్లాల ద్వారా మంచినీరు ఇవ్వాలని సూచించారు. ఇన్‌ టెక్‌ వెల్స్‌, వాటర్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లు, ఎలక్ట్రో మెకానికల్‌ పనులు, పైపులైన్లు నిర్మాణం జరగాలని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగం పట్ల సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

kcr

వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు నీరు చేరుతుందని అదే సమయంలో గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ ఆర్‌ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణం, ఇండ్లలో నల్లాలు బిగించే పనులు జరగాలని చెప్పారు. దీనికోసం అధికారులంతా సమావేశమై వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. గ్రామాలకు నీరు చేరిన వెంటనే మంచినీటి సరఫరా వ్యవస్థకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ పనులను చేపట్టే ఏజెన్సీల పదేళ్ల వరకు నిర్వహించే నిబంధన పెట్టినందున పనుల్లో నాణ్యత ఉంటున్నదనే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్‌ వ్యక్తం చేశారు.

 

నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి మంచినీటి కోసం పది శాతం నీటిని వాడుకోవాలనే విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున దానికి అనుగుణంగా రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పాత ప్రాజెక్టులతో పాటు, కొత్తగా నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు, డిండి, తదితర ప్రాజెక్టుల రిజర్వాయర్ల నుంచి నీటిని వాడాలని కోరారు. ఏ రిజర్వాయర్ నుంచి ఎంత నీరు తోడి, ఎక్కడ వాడాలనే విషయంలో స్పష్టత కావాలని ఇందుకోసం ప్రత్యేకంగా జీవో విడుదల చేయాలని మంత్రి హరీష్‌ రావును సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

 

నీటి పారుదల శాఖ, మిషన్‌ భగీరథ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, నగర ప్రాంతాల్లో పబ్లిక్‌ హెల్త్‌ శాఖ తరుపున మంచినీటి సరఫరా జరుగుతున్నదని, కొత్తగా నగర పంచాయతీలుగా మారిన ప్రాంతాల్లో ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ద్వారానే నీటి సరఫరా జరగాలన్నారు. ఇందుకోసం కూడా కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

- Advertisement -