బాలాపూర్ లడ్డూ@14.65 లక్షలు

577
Balapur Laddu Fetches Record Rs 14.65 Lakh
Balapur Laddu Fetches Record Rs 14.65 Lakh
- Advertisement -

ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 14 లక్షల 65వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో స్కైలాబ్ రెడ్డి పెద్దమొత్తంలో వేలంపాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. పదిలక్షలకు ప్రారంభమైన వేలం పాట …చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. వేలంలో 25 మంది పాల్గొనగా వీరిలో నలుగురు వ్యక్తులు స్థానికేతరులు ఉన్నారు. బాలాపూర్ లడ్డూ గతేడాది రూ. 10.32 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా…! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు.
లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని గణేశ్‌ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి, సామాజిక సేవా కార్యాక్రమాల కోసం వినియోగిస్తూంటారు. హైదరాబాద్ నగరం అంటే గణేష్ నవరాత్రులకు పెట్టింది పేరు. గణేష్ ఉత్సవాలను నగరవాసులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. నగరంలో ఖైరతాబాద్ గణేషుడికి ఎంత ప్రత్యేకత ఉందో బాలాపూర్ గణేషుడి లడ్డూకి కూడా అంతే ప్రత్యేకత వుంది. బాలాపూర్ లడ్డూను దక్కించుకోవటానికి రాజకీయ నాయకుల నుండి పారిశ్రామికవేత్తలు ఇలా పలు రంగాలవారు పోటాపడుతుంటారు.

1980లో మొదలై…
గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటిచెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితోపాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు.
బాలాపూర్ లడ్డూ నా రెండేళ్ల కల: స్కైలాబ్‌రెడ్డి
ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ లడ్డూను దక్కించుకోవడం తన కలని స్కైలాబ్‌రెడ్డి అన్నారు. గత రెండేళ్లుగా బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. బాలాపూర్ లడ్డూ దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్న ఆయన గణేషుడి ఆశీస్సులతో తన కల నెరవేరిందన్నారు. గత ఏడాది కంటే బాలాపూర్ లడ్డూ ధర ఈసారి రూ. 4.33 లక్షలు అధికంగా పలికింది. కాగా తొలిసారి 1994లో నిర్వహించిన బాలాపూర్ లడ్డూ వేలంలో రూ. 450 పలికింది.

https://youtu.be/_Dj1GYgjczo

- Advertisement -