లోక్ సభ ఎన్నికల నేపథ్యంల టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారంలో ముందుకెళ్తోంది. నేడు వరంగల్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. అజంజాహీ మిల్లు గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సభ ప్రాంగణం గులాబీ దళంతో కిక్కిరిసిపోయింది. జనం భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా. ఇక్కడి ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదన్నారు. చైతన్యవంతమైన జిల్లా నుంచి స్ఫూర్తివంతమైన తీర్పు వస్తుందని భావిస్తున్నానన్నారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్టే గెలుపులో కూడా అగ్రభాగాన ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో కూడా దయచేసి అగ్రభాగాన నిలబెట్టాలని కోరుతున్నానని సీఎం అన్నారు.
ఐదేండ్ల క్రితం మన తెలంగాణ ఎంట్లుండే? ఈవాళ తెలంగాణ ఎట్ల ఉన్నది? ఐదేళ్ల క్రితం కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. కరెంటు కోసం లాఠీ చార్జీలు జరిగాయి. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎన్నో చూశాం. ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పరిస్థితి తారుమారైంది. విద్యుత్ తలసరి వినియోగంలో ఇప్పుడు తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ రంగంలో దేశానికే దిక్సూచిగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి రెట్టింపు చేసిన పెన్షన్లు ఇస్తమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు, వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి దయాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు పలువురు హరైయ్యారు.