రియో ఒలింపిక్స్ లో దేశానికి రజత, కాంస్య పతకాలను సాధించారని పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్ లపై రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత క్రీడా సంఘాలు నజరానాలు ప్రకటించాయి. వీరితో పాటు వీరి కోచ్, ఇతర సహాయక సిబ్బందికి కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు మొదలయ్యాయి. ఇటీవల సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా దీపాకర్మాకర్, సాక్షి మాలిక్, పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్ కు బీఎండబ్ల్యూ కార్లు కూడా అందజేసి వారిని సన్మానించారు. అయితే కొన్ని దేశాల్లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి.
కెన్యాలోని ఓ మారుమూల గ్రామం ఎన్‌డబబిట్. అసలు ఆ పేరుతో ఓ గ్రామం ఉందని అక్కడి వారికే చాలామందికి తెలియదు. అయితే రియో ఒలింపిక్స్ పుణ్యమా అంటూ ఆఊరిపేరు కెన్యా దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ గ్రామం నుంచి వచ్చిన ఫెయిత్ కిప్యెగాన్ అనే మహిళా అథ్లెట్ 1500మీటర్ల పరుగుపందెంలో గోల్డ్ మెడల్ సాధించడంతో ఎన్‌డబబిట్ గ్రామం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అంతేకాదు నలభై ఏళ్లుగా ఆ కుగ్రామానికి విద్యుత్ సరఫరా కూడా లేదు. ఫెయిత్ బంగారు పతకం సాధించడంతో ఆ ఊరికి కరెంటు వచ్చింది. ఇప్పుడు సకల సౌకర్యాలు ఆ ఊరికి కల్పిస్తోంది ప్రభుత్వం.
అక్కడ ఇప్పటికీ కరెంట్ సౌకర్యం లేదు. ఆమె గోల్డ్ మెడల్ కొట్టిందన్న విషయం ఆ కూతురు వచ్చి చెప్పేదాకా ఆ కుటుంబానికి తెలియదు. ఫెయిత్ గెలుపు విన్న ఆ తల్లిదండ్రులకు, ఆ ఊరి ప్రజల సంతోషానికి హద్దులు లేవు. ఈ సంతోషం ఇంకా ముందే రావాలనిపించింది ఆ తండ్రికి. అందుకే కూతురు గెలిచిన సందర్భంగా.. ఒక కోరిక కోరాడు. అదే.. ఆ ఊరికి కరెంట్ రావడం.
వెంటనే ఫెయిత్ ఆ దేశ ప్రెసిడెంట్‌కి ఒక ఆర్జీ పెట్టుకుంది. ఆమె విన్నపాన్ని విన్న ఆయన తొమ్మిది రోజుల్లోనే ఆ ఊరికి కొత్త వెలుగులు తీసుకొచ్చాడు. మొదటిసారి ఆ ఊరు కొత్త వెలుగులతో, ఫెయిత్ తెచ్చిన పసిడి కాంతులతో వెలిగిపోతోంది. ఎవరైనా పతకాన్ని గెలిచారనగానే ప్రైజ్‌మనీ, కార్లు, బంగ్లాలు కోరుకుంటారు. కానీ ఫెయిత్‌కి మేం చాలా రుణపడి ఉన్నాం. చీకట్ల నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేసింది. తను బంగారు పతకాన్ని సాధించడం వల్లే ఇది సాధ్యమైంది అంటూ ఆ ఊరి ప్రజలు ఆమెను పొగుడుతున్నారు. నిజంగా ఆమె పడిన కష్టం ముందు ఈ కోరిక చాలా చిన్నదేమో!