తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య హైదరాబాద్ పరిధిలో భారీవర్షం కురిసింది. గంట వ్యవధిలో 9.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం.
గురువారం మధ్యాహ్నం నగరంలోని పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. అనంతరం గంటపాటు కుండపోతగా కురుస్తూనే ఉంది. నగరంలో వినాయక నిమజ్జనం సాగుతున్న సమయంలో వరుణుడు ప్రతాపం చూపించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో 8.5 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 7.3 సెం.మీ, పరిగిలో 6.9సెం.మీ, నవాబ్ పేటలో 6.5సెం.మీ, వికారాబాద్ లో 6.2సెం.మీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ లో 6.8 సెం.మీ, హసన్ పర్తిలో 4సెం.మీ వర్షం కురిసింది.