కొహ్లీకి టీమ్‌లో స్థానం దక్కకపోవడమేంటీ….

562
Here are the results of India's DreamTeam
- Advertisement -

చారిత్రక 500వ టెస్ట్‌ను పురస్కరించుకుని బీసీసీఐ.. మీ డ్రీమ్ టీంను ఎంపిక చేయాలని అభిమానుల్ని కోరింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను సోమవారం నాడు బీసీసీఐ విడుదల చేసింది. ఈ డ్రీమ్‌టీమ్‌లో 500వ టెస్ట్‌లో కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీకి మాత్రం చోటు లేకుండా పోయింది. ఇపుడు దీనిపై అంతటా విమర్శలు వస్తున్నాయి. కాగా, డ్రీమ్ టెస్టు ఎలెవన్ జట్టులో యువరాజ్ సింగ్ కు 12వ ఆటగాడిగా స్థానం కల్పించారు. అయితే యువరాజ్ సగటు కంటే కోహ్లి సగటు ఎక్కువగా ఉంది. టెస్టు యావరేజ్లో విరాట్ మెరుగ్గా ఉన్నా డ్రీమ్‌ టీమ్‌ కోహ్లీ లేకపోవడమేంటని పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2012లో చివరిసారి టెస్టు మ్యాచ్ ఆడిన యువరాజ్ ఈ ఫార్మాట్లో 33.92 యావరేజ్ తో ఉండగా, విరాట్ కోహ్లి టెస్టు యావరేజ్ 45.06 గా ఉంది. దాంతో పాటు ఈ టీమ్లో భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీకి కూడా చోటు లభించలేదు. భారత జట్టుకు దూకుడు నేర్పిన గంగూలీ తన టెస్టు కెరీర్లో 116 మ్యాచ్లు ఆడటంతో పాటు 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతని టెస్టు యావరేజ్ 42.17 గా ఉంది. దాంతో పాటు 32 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

అత్యధికంగా 96 శాతం ఓట్లతో రాహుల్‌ద్రావిడ్‌కు అభిమానులు జట్టులో చోటు కల్పించారు. కాగా, 113 టెస్టుల్లో 7212 పరుగులతో భారత్‌కు ఎనలేని విజయాలనందించిన సౌరవ్‌ను అభిమానులు విస్మరించడం గమనార్హం. 2007-8 సీజన్‌లో పాక్‌తో టెస్టులో డబుల్‌ సెంచరీ (239) చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్టాండర్‌గానూ గంగూలీ ఘనత వహించడం విశేషం. వీరేంద్ర సెహ్వాగ్‌, సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌లను అభిమానులు డ్రీమ్‌ టీమ్‌కు ఎన్నుకున్నారు.

ఇదిలా ఉంచితే క్రికెట్ ఆస్ట్రేలియాకు సంబంధించి ఉత్తమ భారత జట్టులో గంగూలీ స్థానం దక్కగా, విరాట్ కు ఇందులో కూడా స్థానం లభించలేదు. ఈ రెండు జట్లకు మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్ గా ఎంపిక చేశారు.

అభిమానుల డ్రీమ్‌ టీమ్‌: సునీల్‌ గవాస్కర్‌ (68 శాతం ఓటింగ్‌), వీరేంద్ర సెహ్వాగ్‌ (86 శాతం), రాహుల్‌ ద్రావిడ్‌ (96 శాతం), సచిన్‌ టెండూల్కర్‌ (73 శాతం), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (58 శాతం), కపిల్‌దేవ్‌ (91 శాతం), ధోనీ (కెప్టెన్‌, వికెట్‌కీపర్‌, 90 శాతం), అశ్విన్‌ (53 శాతం), అనిల్‌కుంబ్లే (92 శాతం), జవగళ్‌ శ్రీనాథ్‌ (78 శాతం), జహీర్‌ఖాన్‌ (83 శాతం), యువరాజ్‌సింగ్‌ (62 శాతం).

- Advertisement -