న్యూజిలాండ్ తో జరుగుతున్న చారిత్రత్మాక టెస్టులో భారత్‌కు 433 పరుగుల ఆధిక్యత లభించింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. రోహిత్ 68 పరుగులు, జడేజా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత స్కోరు 107.2 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. కివీస్ గెలవాలంటే 434 టార్గెట్‌ని ఛేదించాలి.
కాన్పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగుల వద్దే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో వచ్చిన రోహిత్ 75 బంతుల్లోనే తన మార్కు బౌండరీల(7×4)తో అలరించి కెరీర్లో 5వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
అంతకు ముందు ఆటలో నాలుగో రోజైన ఆదివారం 159/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 185 పరుగుల వద్ద నిలకడగా ఆడుతున్న ఓపెనర్ మురళీ విజయ్ (76) వికెట్‌ను చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కనీసం రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయిన కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లోనూ 18 పరుగులకే పేలవ షాట్‌తో ఔటైపోయాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో 400 పరుగులు దాటిన స్కోరును సెకండ్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిచిన దాఖలాలు రెండు మాత్రమే ఉన్నాయి. దీంతో ఏదైనా అద్భుతం జరిగితేనే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లను అవుట్ చేయడంలో మన బౌలర్లు విఫలమైతే, మ్యాచ్ డ్రా అవుతుంది.