రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహనలేదని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇవాళ ఆమె తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహట్టిపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఆమె ధన్యావాదాలు తెలిపారు. సీఎల్పీ నేత జానారెడ్డి బాటలో నడవాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు నిజామాబాద్ ఎంపీ కవిత. మహారాష్ట్రతో ఒప్పందాలతో రాష్ట్రానికే ప్రయోజనమని.. అనవసర విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు. కొరాటా చనాఖా ప్రాజెక్టుతో ఆదిలాబాద్ ప్రజలకే పూర్తి లాభం… తుమ్మడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడుతున్నారని.. తెలంగాణ మ్యాప్ చూసి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. వర్కింగ్ ప్రెసిడెంటో.. వర్క్ లేని ప్రెసిడెంటో అర్థం కావడం లేదని తెలిపారు. కీలెరిగి వాతపెట్టడం.. ఎక్కడ పట్టాలో.. ఎక్కడ వదిలిపెట్టాలో సీఎం కేసీఆర్ కు తెలుసునని.. తుమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తు అన్నది కరెక్టే అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా అందరు బాగుండాలని తమ పార్టీ భావిస్తుందన్నారు. బేగానా షాదీమే అబ్దుల్లా దివానా… అన్నట్టు బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురాకుండా.. ఇష్టానుసారంగా మాట్లాడ్డం ఏమిటని ప్రశ్నించారు ఎంపీ కవిత.
లోయర్ పెన్‌గంగను తాము నిర్మించలేమని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోలేదని విమర్శించారు. ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. పట్టువిడుపులుండటం మంచి నేతకు ఉండాల్సిన లక్షణమన్నారు. ఆ లక్షణం కేసీఆర్‌కు ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకు మొబలైజేషన్ మీద ఉన్న ఇంట్రెస్టు ప్రాజెక్టుల మీద లేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనన్నారు. జిల్లాల విభజనపై రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదన్నారు. సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకురావాలని ఆయన వాటిని పరిష్కరిస్తారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ రైతుల బాగోగులు పట్టించుకున్న వ్యక్తి అని కొనియాడారు. మేడిగడ్డ బ్యారేజీతో రైతుల జీవితాలు మారిపోతాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీతో నల్లగొండ ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు.