ఇటీవల ఛత్తీస్‌గఢ్ లోని కాంకేర్‌కు చెందిన బీజేపీ నేత మంతూరామ్ కుమారుడు ఓవర్టేక్ చెయ్యడానికి తన కారుకి దారివ్వలేదని ఓ రాజకీయ నేత పుత్రరత్నం ఇద్దరు యువకులను చితకబాదాడు. గత నెల ఆగస్టు 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనను మరవక ముందే… బీహార్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
కారుతో బైక్‌ను ఓవర్టేక్ చేయడంలో విఫలమైన ఆర్జేడీ ఎమ్మెల్యే బీరేంద్ర సింగ్ కుమారుడు కునాల్ ప్రతాప్ రెచ్చిపోయి బైకర్‌ను కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఆ బైకర్ పాట్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బాధితుడి పేరు పింటూ అని గుర్తించారు. ఔరంగాబాద్ జిల్లాలోని ఓబ్రా వద్ద కారులో ప్రయాణిస్తున్న కునాల్ ప్రతాప్ అదే రోడ్డుపై వేగంగా బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని చూశాడు. కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో బైకర్‌ను అడ్డుకుని అతనిపై కత్తితో దాడి చేశాడు. శుక్రవారం రాత్రి ఈ దాడికి పాల్పడిన కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. బీహార్‌లో జంగిల్ రాజ్ పాలనకు ఇది మరో ఉదాహరణ అంటూ విపక్షాలు మండిపడ్డాయి.
కాగా, మే 7న బిహార్‌లోని గయా జిల్లాలో జేడీయూ ఎమ్మెల్యే మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ కేవలం తన కారును ఓవర్టేక్ చేసినందుకు ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే.