KTR:తెలంగాణలో జీరో రిక్రూట్‌మెంట్‌

6
- Advertisement -

మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్ తో సీఎం పలికిస్తున్న చిలుక పలుకులు చూసి యువతరం ఛీకొడుతోంది అన్నారు.

తొలి సంవత్సరమే రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయండని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గారి మాట అమలై ఉంటే.. ఈ దగాకోరు సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేది. కేసీఆర్ గారి హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి ఫోటోలకు ఫోజు కొట్టిన సీఎం, ఆ తరువాత మొత్తానికే చేతులెత్తేయడంతోనే తెలంగాణలో “రిక్రూట్ మెంట్ జీరో”గా మారిపోయింది అన్నారు.

అప్పటికే లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పనిగట్టుకుని రేవంత్ చల్లిన బురద అంతా అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయింది. పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వని చేతకాని దద్దమ్మ పాలన చూసి నిరుద్యోగులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.

జాబ్ క్యాలెండర్ కు పాతరేసి, వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును నిత్యం తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. రెండు లక్షల ఉద్యోగాల హామీపై నాలుక మడతేసినంత మాత్రాన నాలుగు కోట్ల ప్రజలు ఊరుకుంటారని, ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని మరిచిపోతారని అనుకుంటే అది పొరపాటే..

తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసినందుకు ముఖ్యమంత్రి ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పినా, పొర్లుదండాలు పెట్టినా క్షమించే ప్రసక్తే లేదు. మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేళ్లనుంచి మూగబోయినంత మాత్రాన మీరు చేసిన పాపం ఊరికేపోదు. మెగా డీఎస్సీ పేరిట దగా, నిరుద్యోగ భృతి పేరిట చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పేందుకు ఆదిలాబాద్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకూ ప్రతి నిరుద్యోగి సిద్ధంగా ఉన్నాడు.

ఇప్పటికే మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారు. కేసీఆర్ గారి పాలనలో ఆత్మగౌరవంతో బతికిన రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి తీరని ద్రోహం చేశారు. సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు 2500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేళ్లయినా ఒక్కరికీ దిక్కులేకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారు. ఆరు గ్యారెంటీలన్నీ అక్షరాలా గారడీలేనని, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన రేవంత్ సర్కారుకు నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ యువత సంఘటిత శక్తిలో ఉన్న బలం ఏంటో, వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్ పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తాం అన్నారు.

Also Read:శాశ్వత్ సచ్‌దేవ్..’ది ఇండియా హౌస్’

- Advertisement -