గో సంరక్షణ శాలల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల సహకారం కోరడానికి నెలరోజుల లోపు సమావేశం ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.పరిశ్రమల సామాజిక బాధ్యత ( సిఎస్ఆర్) కింద గోశాల నిర్వహణ, గో సంరక్షణకు తోడ్పాటు అందించేలా కార్పొరేట్ సంస్థలకు అవగాహన కల్పించాలని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో గురువారం రాత్రి ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీబీసీ అధికారులతో చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ,చెన్నై ప్రాంతాల నుంచి పలువురు గోసంరక్షణ శాల నిర్వాహకులు హాజరయ్యారు. గోశాల నిర్వహణ, గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ వాటి మార్కెటింగ్ లో ఎదురవుతున్న ఇబ్బందులను వారు చైర్మన్ కు వివరించారు.
గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయంప్రోత్సహించడానికి టిటిడి ముందు వరుసలో ఉంటుందని చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే గత నెలలో తిరుపతిలో జాతీయ గో మహాసమ్మేళనం నిర్వహించామన్నారు. ఇందుకు కొనసాగింపుగానే గోశాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఇబ్బందులు, సమస్యల గురించి తెలుసుకున్నట్టు ఆయన చెప్పారు. తమిళనాడు , కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల యజమానులతో నెలలోపు సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు తగిన తీసుకోవాలని అధికారులకు సూచించారు.
హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత ఉదృతంగా చేయడం కోసం దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడులో గుడికో గోమాత పథకం కింద 100 ఆలయాలకు గోవు, దూడలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పాలక మండలి సభ్యులకు ఇందుకు సంబంధించిన భాద్యతలు అప్పగించారు. గత నెల 29వ తేదీ విశాఖపట్నంలో నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రతి నెల దక్షిణ భారతదేశంతో పాటు ఢిల్లీ, ముంబై నగరాల్లో ఎక్కడో ఒక చోట పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను
ఆదేశించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ గత రెండేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని ఛానల్ ఉన్నతాధికారులు సిబ్బందిని చైర్మన్ అభినందించారు. రెండు సంవత్సరాల క్రితం వీక్షకుల సంఖ్య కోటి ఉంటే , ఇప్పుడా సంఖ్య ఏడు కోట్లకు పెరిగింద న్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన కన్నడ, హిందీ ఛానళ్లను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రణాళికలుతయారు చేయాలన్నారు. ఎస్వీబీసీని విరాళాల సేకరణ ద్వారా స్వయం సమృద్ధిగా తయారుచేసి సొంత కాళ్లపై నిలబడేలా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.
ఈ సమావేశాల్లో టీటీడీ పాలకమండలి సభ్యులు విశ్వనాథ్, మురం శెట్టి రాములు, విద్యాసాగర్, మల్లీశ్వరి,ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచేంద్ర, జెఈవో వీరబ్రహ్మం, ఎఫ్ఎ సి ఏ వో బాలాజి, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల సమన్వయ కర్త విజయ సారథి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రామారావు అధికారులు పాల్గొన్నారు.