DC అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్

8
- Advertisement -

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కీలక మార్పులు చేపట్టింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అసిస్టెంట్ కోచ్‌, బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గంగూలీతో తనకు జరిగిన సంభాషణ గురించి యువరాజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

భారత క్రికెట్‌లో గంగూలీ, యువరాజ్‌ది ప్రత్యేక అనుబంధం. 2000లో గంగూలీ కెప్టెన్సీలోనే యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున కలిసి పనిచేయనున్నారు.ఢిల్లీ క్యాపిటల్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన వీడియోలో యువరాజ్ మాట్లాడుతూ.. అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని గంగూలీ తనను అడిగినట్లు తెలిపాడు.

“సౌరవ్ గంగూలీ నన్ను ‘నువ్వు నా అసిస్టెంట్‌గా ఉంటావా?’ అని అడిగారు. అందుకు నేను.. ‘గత 25 ఏళ్లుగా నేను మీకు అసిస్టెంట్‌గానే ఉన్నాను. ఇప్పుడు కూడా అదే పని చేస్తాననుకుంటా’ అని సరదాగా సమాధానం ఇచ్చాను” అని యువరాజ్ వెల్లడించాడు.ఈ కొత్త బాధ్యతలపై తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు. గత మూడు, నాలుగేళ్లుగా ఈ అవకాశానికి సిద్ధమవుతున్నానని వివరించాడు. ఇప్పటివరకు పలువురు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా పనిచేశానని, అయితే ఒక పూర్తి జట్టుతో కలిసి పనిచేయడం భిన్నమైన అనుభవమని పేర్కొన్నాడు.

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ క్రికెటర్లకు మార్గదర్శకత్వం వహించిన యువరాజ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో తన అనుభవాన్ని పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.తన క్రికెట్ కెరీర్‌లో గంగూలీ నేర్పిన ముఖ్యమైన విషయాలను కూడా యువరాజ్ గుర్తుచేసుకున్నాడు. జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం, ఆటగాళ్లందరినీ కలిసికట్టుగా ఉంచడం గంగూలీ నుంచి నేర్చుకున్నానని తెలిపాడు.

Also Read:‘జైలర్ 2’..జాతర

“దాదా నుంచి నేను నేర్చుకున్న గొప్ప విషయం జట్టులో మంచి వాతావరణాన్ని ఎలా సృష్టించాలన్నది. నేను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆయన కెప్టెన్‌గా ఉన్నారు. ఆటగాళ్లందరినీ కలిసికట్టుగా ఉంచేవారు. మనం గొప్ప జట్టుగా ఎదగగలమని, విదేశాల్లోనూ టోర్నమెంట్లు గెలవగలమని మాలో నమ్మకం కలిగించారు” అని యువరాజ్ చెప్పాడు.

- Advertisement -