త్వరలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన..!

164
YS Sharmila
- Advertisement -

తెలంగాణ మరో కొత్త రాజకీయ కొత్తపార్టీ అవతరించబోతోంది. తెలంగాణ రాజకీయాల్లోకి త్వరలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సమాయాత్తమౌతోన్నారు వైఎస్ షర్మిల. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి అవుతోన్నాయి. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇది వరకే ప్రకటించిన వైఎస్ షర్మిల ఉమ్మడి జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ ఆత్మీయ సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తారని ఆమె అనుచరుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు.

పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి వాటిని కూడా ఆ రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. షర్మిల మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలు, తాగు, సాగునీరు వంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వచ్చే నెల 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమావేశం ఉంటుంది. అదే రోజున పార్టీని ప్రకటించే అవకాశం ఉందని దేవేందర్‌రెడ్డి తెలిపారు.

కాగా,వైఎస్ షర్మిల నెలకొల్పబోయే పార్టీ పేరు- వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రచారంలో ఉంది. ఆత్మీయ సమావేశాలను ప్రారంభించిన తొలి గంటలోనే ఈ పేరు ప్రచారంలోకి వచ్చింది. విస్తృతంగా జనంలోకి వెళ్లింది. తమ పార్టీ పేరు ఇదేనంటూ షర్మిల గానీ, సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి గానీ ఎక్కడా ప్రకటించలేదు. తాజాగా- ఈ పేరును మార్చాలని షర్మిల భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె పరిశీలనలో రెండు కొత్త పేర్లు ఉన్నాయని అంటున్నారు. వైఎస్ఆర్‌టీపీ లేదా రాజన్న రాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలిస్తోన్నారని సమాచారం. అభిమానుల సూచనల మేరకే పార్టీ పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -