ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ రాజకీయాల్లో తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు వైఎస్ షర్మిల. వైసీపీ ప్రభుత్వంపై తనదైన రీతిలో ఘాటు విమర్శలు చేస్తూ రాజకీయ వేడి పెంచుతున్నారు. ఏపీలో సెన్సిటివ్ టాపిక్స్ అయిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని అంశం వంటి వాటిపై తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె డిల్లీలో దీక్షకు దిగడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చలనే డిమాండ్ తో ఆమె దీక్ష చేపట్టనుంది. ఇప్పటికే మద్దతు కూడగట్టుకునేందుకు ఎన్సీపీ అధినేత శరత్ పవార్, సీతారాం ఏచూరి వంటి ముఖ్య నేతలతో కూడా సమావేశం అయింది. .
ఈ నేపథ్యంలో షర్మిల దీక్ష ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపనుందనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతం ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యేక హోదా అంశంపై గాని, విభజన హామీల విషయంలో గాని కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం చేయడం లేదు. దీంతో ఈ మూడు పార్టీలు అంతర్గతంగా బీజేపీకి కొమ్ము కాస్తున్నాయని, ఈ పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని షర్మిల తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక షర్మిల చేపడుతున్న దీక్ష కారణంగా ప్రత్యేక హోదా అంశం హైలెట్ అయితే ఆ మూడు పార్టీలకు నష్టమేననే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రత్యేక హోదా పై గళం విప్పిన పార్టీగా కాంగ్రెస్ నిలిస్తే ఆ క్రెడిట్ షర్మిలకు దగ్గే అవకాశం ఉంది. అందుకే సున్నితమైన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రచార అస్త్రంగా షర్మిల ఉపయోగించుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం. మరి ఎన్నికల ముందు ఈ ప్రత్యేక హోదా అంశం హైలెట్ అవుతుందా ? ఒకవేళ హైలెట్ అయితే ఏపీలోని ప్రధాన పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. మరి షర్మిల దీక్ష ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో చూడాలి.
Also Read:మూవీ రివ్యూ: గేమ్ ఆన్