అందరూ ఊహించినట్లుగానే వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతగా మారిపోయారు. గత కొన్నాళ్లుగా పార్టీ విలీనంపై అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన ఆమె ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇక తెలంగాణలో ఆమె పాత్ర ముగిసినట్లేననే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమెకు బాద్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అటు ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఏపీ రాజకీయల్లో షర్మిల ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది..
ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉండే కడప జిల్లాలో జగన్ వర్సస్ షర్మిల రాజకీయం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఏపీ కాంగ్రెస్ తరుపున ఆమె అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల బరిలో దిగితే రెండు విధాలా వైఎస్ జగన్ కు తీవ్ర నష్టమే అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట. కడప ఎంపీ స్థానంలో గత కొన్నేళ్లుగా వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. ఈసారి వైసీపీ నుంచి కడప ఎంపీ స్థానానికి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతున్న వేళ అటు కాంగ్రెస్ తరుపున షర్మిలా బరిలోకి దిగితే మెజారిటీ ఓటు బ్యాంకు షర్మిల వైపు తిరిగే అవకాశాలు ఉన్నాయి.
అలా కాకుండా కాంగ్రెస్ తరుపున పులివెందుల నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే అది కూడా జగన్ కు తీవ్ర నష్టమే. ఎందుకంటే పులివెందుల నుంచి స్వయంగా జగనే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో అన్నాచెల్లెళ్ల మద్య రసవత్తరమైన పోరు నెలకొనే అవకాశం ఉంది. అయితే షర్మిల గెలిచిన ఓడిన అమెకొచ్చే నష్టమేమీ లేదు. కానీ వైఎస్ జగన్ ఓడిపోతే రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి కడప కేంద్రంగా జగన్ వర్సస్ షర్మిల రాజకీయ పోరు ఎలా ఉండబోతుందో చూడాలి.
Also Read:స్క్వాట్స్ వ్యాయామం చేయడం మంచిదేనా?