సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురితమైన ఓ కథనం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ భారతి చేసిన తప్పుడు ట్వీట్ అంటూ ఆంధ్రజ్యోతి ఆ కథనాన్ని వెలువరించగా.. తనకసలూ సోషల్ మీడియాలో ఖాతానే లేదని, మీరే తప్పుడు కథనాన్ని వెలువరించారన్న రీతిలో వైఎస్ భారతి కౌంటర్ ఇచ్చారు.
ఆ ఫొటో తాను పోస్టు చేసింది కాదని, తనకు ఫేస్‌బుక్‌లో కానీ, ట్విట్టర్‌లో కానీ ఖాతాలు లేవని స్పష్టం చేసింది వైఎస్ భారతి. తన పేరుతో ఎవరైనా నకిలీ ఖాతా సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా వాస్తవదూరమని భారతి స్పష్టం చేశారు.
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నంద్యాలలో వైఎస్ జగన్ మార్గమధ్యంలో ఓ పొలంలోని పంపుకింద నీళ్లను తాగుతున్నట్టు ఉంది. ఫేస్‌బుక్‌లో వైఎస్ భారతి పేరుపై ఉన్న ఖాతాలో ఈ ఫొటో పోస్ట్ అయింది. ‘జగన్ ప్రజల కోసం ఎంతగా తపిస్తున్నాడో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలు’ అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ రాశారు. వైఎస్ భారతి పేరుతో పోస్ట్ అయిన ఈ ఫొటో నిజానికి జగన్‌ది కాదు. జగన్‌లా ఉన్న మరో వ్యక్తి సాక్షి రిపోర్టర్‌ది.
దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ‘భారతి తన భర్తను గుర్తించలేకపోయారా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేశారు. అయితే, అధికార టీడీపీ శ్రేణులు కూడా అలాగే పొరబడ్డారు. సీమలో పచ్చని పొలాల వద్ద దారళంగా నీరు వస్తున్న పంపులో జగన్ దాహం తీర్చుకున్నారు. ఇది టీడీపీ చేసిన అభివృద్ధికి సూచిక అని కామెంట్లు పెట్టారు.
తీరా అసలు విషయం తెలిసిన తర్వాత అంతా నవ్వుకున్నారు. జగన్ పాదయాత్ర చేస్తున్న వేళ.. ఇలాంటి కథనాలతో వైసీపీని దెబ్బతీయడానికి అధికార పార్టీ వేసిన ఎత్తుగడ పలువురు విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతా భారతిదేనా? కాదా? అన్న విషయాన్ని ధ్రువీకరించుకోకుండా.. పత్రిక మొదటి పేజీలో హైలైట్ అయ్యేలా కథనాన్ని ప్రచురించడం ఎంతవరకు సమంజసం అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.