ఏపీ సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లా నంద్యాలలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బాబు నేనిచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు. నేనిచ్చిన రేషన్ తీసుకుంటున్నారు. నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నాకు ఓటేయకుంటే ఎట్లా? అని ప్రశ్నించారు. నాకు వ్యతిరేకంగా ఏవైనా గ్రామాలుంటే వాటికో నమస్కారం పెడతా. నేనంటే మీకు ఇష్టం లేకపోతే… నేను మీకెందుకు పనులు చేయాలి? అంటూ ఎదురుప్రశ్నలు వేశారు.
నా పరిపాలన బాగా లేదంటే నేనేమీ తీసుకోను. నాకేమీ వద్దు’అని అనాలని అప్పుడు ఎవరికి బాధ ఉండదన్నారు. నేను తలచుకుంటే ఓటుకు 5వేల రూపాయిలు ఇవ్వగలను, కానీ ఎందుకు ఇవ్వాలి. మీకు ఓటుకు 5 వేలు ఇవ్వాలంటే మీ దగ్గరే నేను 5 లక్షల చొప్పున వసూలు చేయాలనడంతో అక్కడనున్న వారంతా విస్తు పోయారు.
సీమ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి నాయకులను తీసుకొచ్చా. మా కంటే మా తర్వాత తరం నాయకులు మరింత పాజిటివ్‌గా ఉన్నారు. రాజకీయంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చాం. నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి, ఎన్నికలు గెలవాలి. గెలవడానికి నాయకుడు కావాలి కాబట్టి మేం కొన్ని రాజీ పడ్డాం. మేం రాజీపడడం వల్ల టీడీపీలో కొంతమందికి నష్టం కూడా జరిగిందన్నారు.
కొంతమంది నాయకులకు నష్టం జరిగిందని కూర్చున్న చెట్టును నరుక్కుంటామా? నావల్ల లాభం పొందినవాళ్లంతా మళ్లీ నాకు ఓటేయాలి కదా! పదేళ్ల కిందే నేను అధికారంలో ఉంటే రాష్ట్రం ఎక్కడికో పోయేది. నేను వెయ్యి పెన్షన్ ఇస్తున్నా. రుణమాఫీ చేశా, ఎవరు డబ్బిచ్చినా నాకే ఓటేయాలి. కర్నూల్ జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.