తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారెక్కుతుండగా తాజాగా మరో ఎమ్మెల్యే సైతం టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా టీఆర్ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన ఇప్పటికే ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని.. 19న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభలో టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ,పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుపై విజయం సాధించిన కందాల గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భేటీ అయి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
వీరితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరిబాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉండటంతో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఖాళీ దిశగా సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాలను గెలుచుకున్నది. ఆ తరువాత ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక టీడీపీ, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిసి టీఆర్‌ఎస్ బలం 97కు చేరింది. త్వరలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా చేరితో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 98కి చేరనుంది.