కర్ణాటకలో ఎన్నికలే పూర్తి కాలేదు… కానీ అప్పుడే బీజేపీ సీఎం అభ్యర్థి మాత్రం ఏకంగా తన ప్రమాణస్వీకారం తేదీను ఖరారు చేసేశారు. ఈ నెల 17 కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు చెప్పారు. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీని కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు కొందరు బీజేపీ నేతలు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి కానీ ఓటు వేసేందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కర్ణాటకలో పోలింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. కర్ణాటకలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ప్రధాన పార్టీల సీఎం అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శిఖరిపురిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే… మే 15న ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలుస్తానని తెలిపారు. మే 17న కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రామానికి ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 222 స్థానాలకు గాను 140 నుంచి 150 స్థానాల్లో బీజేపీ విజయం కేతనం ఎగురవేస్తుందని యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ.. ఆపలేరని ప్రస్తుత సీఎం సిద్దరామయ్య అన్నారు. మైసూరులోని సిద్దరామహుండీలో ఓటు హక్కుకుని వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని తెలిపారు. కర్ణాటకలో ప్రధాని మోడీ మెనియా పనిచేయదని, బీజేపీ ఓటమి ఖాయమన్నారు. మరో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీకి 70 సీట్లకు మించి రావని, బీజేపీ నేతలు ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని అనవసరమైన కలలు కంటున్నారని విమర్శించారు.