అత్యంత వైభవంగా యాదాద్రి మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం..

148
- Advertisement -

నమో నారసింహా.. యాదాద్రీశా గోవిందా.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ, భక్తుల జయ జయధ్వానాల మధ్య సోమవారం ఉదయం నవ వైకుంఠంగా పునర్నిర్మించిన యాదాద్రిలో మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం వైభవంగా జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొనగా, ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు.

యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సోమవారం ఉదయమే మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్ర‌భుత్వ అధికారులు, అర్చ‌కులు, వేద పండితులు పాల్గొన్నారు.

శోభాయాత్ర‌లో భాగంగా బంగారు క‌వ‌మూర్తులు, ఉత్స‌వ విగ్ర‌హాలు, అళ్వార్లు ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు జరిపారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్ఛ‌ర‌ణలు, మేళ‌ తాళాల మ‌ధ్య శోభాయాత్ర వైభ‌వంగా కొన‌సాగగా, ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. ప్రధానాలయ పంచతల రాజగోపుర‌రం వద్ద కేసీఆర్ స్వయంగా స్వామివారి పల్లకీని మోశారు.

మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వంలో భాగంగా, దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ దంపతులు ప్ర‌త్యేక పూజ‌లు చేసి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసి పండితులు ఆశీర్వ‌చ‌నం చేశారు. సప్త గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. రాజ గోపురాల‌పై స్వ‌ర్ణ క‌ల‌శాల‌కు 92 మంది రుత్వికుల‌తో సంప్రోక్ష‌ణ చేశారు. విమాన గోపురాల శిఖ‌రాల‌పై క‌ల‌శ సంప్రోక్ష‌ణ కైంక‌ర్యాలను ఘనంగా నిర్వ‌హించారు.

- Advertisement -