ఓటు వేయడం మర్చిపోయి..ఓడిపోయాడు

285
elections
- Advertisement -

తెలంగాణలో జరిగిన ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. కొన్నిచోట్ల పోరు వన్‌సైడ్ కాగా మరికొన్నిచోట్ల నువ్వానేనా అన్నట్లు సాగింది. కొన్నిగ్రామాల్లో ఒక్క ఓటుతో ఓడిపోయిన వారున్నారు.

అలాంటి వారిలో ఈ సర్పంచ్ అభ్యర్థిది కాస్త డిఫరెంట్ స్టోరీ. అదృష్టం కలిసివచ్చినా దురదృష్టం వెక్కరిస్తే ఇలాగే ఉంటుందనడానికి ఈయనే ప్రత్యక్ష ఉదాహరణ. తనకు ఓటు వేసి గెలిపించాలంటూ అందరినీ కోరిన ఆ అభ్యర్థి చివరికి తన ఓటునే వేసుకోవడం
మర్చిపోయాడు. ఫలితం.. ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యాడు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రంగాపురం గ్రామ సర్పంచ్ పదవికి మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. పోలింగ్ సమయం గడుస్తున్న ఆగంరెడ్డి దంపతులు తమకే ఓటు వేయాలంటూ అందరినీ అభ్యర్థించారు. అయితే, ప్రచారంలో పడి తమ ఓట్లను వేసుకోవడం మర్చిపోయారా దంపతులు. తీరా ఫలితాలు చూసే సరికి తలపట్టుకుని కూర్చుకున్నారు. ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రభాకర్‌రెడ్డికి 227 ఓట్లు రాగా.. ఆగంరెడ్డికి 226 ఓట్లు వచ్చాయి.

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానెపల్లి మండలం కోయపెల్లి గ్రామానికి చెందిన గెడెం ప్రీతి, ప్రత్యర్థి సుహాసినిపై ఒక్క ఓటుతో గెలుపొందారు. ప్రీతికి 116 ఓట్లు రాగా.. సుహాసినికి 115 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పొచ్చర గ్రామంలో సర్పంచి అభ్యర్థి కంది మమత (224 ఓట్లు), ప్రత్యర్థి అల్లూరి వెంకటమ్మ(223 ఓట్లు)పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.

- Advertisement -